సొంతడబ్బులతో ఆదుకున్న మంత్రి సిద్ధూ | Sakshi
Sakshi News home page

సొంతడబ్బులతో ఆదుకున్న మంత్రి సిద్ధూ

Published Mon, Apr 24 2017 3:16 PM

సొంతడబ్బులతో ఆదుకున్న మంత్రి సిద్ధూ - Sakshi

అమృత్‌సర్‌: పంజాబ్‌ టూరిజం మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మరోసారి దయాగుణం చాటుకున్నారు. అగ్నిప్రమాదంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వ్యక్తిగతంగా 24 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వనున్నట్టు సిద్ధూ ప్రకటించారు.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరి, అమృత్‌సర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధూకు సీఎం అమరీందర్‌ సింగ్‌ మంత్రి వర్గంలో స్థానం లభించిన సంగతి తెలిసిందే. ఓథియన్‌ అనే గ్రామం సమీపంలో ఇటీవల హై టెన్షన్ విద్యుత్‌ వైర్‌ తెగిపడటంతో అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 300 ఎకరాల్లో పంట కాలిబూడిదైంది.

ఆదివారం ఈ గ్రామాన్ని సందర్శించిన సిద్ధూ రైతులను ఆదుకుంటానని ప్రకటించారు. ఒక్కో ఎకరాకు 8 వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు చెప్పారు. 'అగ్ని ప్రమాదం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేనిచ్చే పరిహారం వారికి చాలదని తెలుసు. రైతులను కొంత మేరకైనా ఆదుకోవాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా సాయం చేయాలని నిర్ణయించుకున్నా. ప్రభుత్వంపై భారం పడకుండా సొంత నిధులు విరాళంగా ఇస్తున్నా' అని సిద్ధూ చెప్పారు. సిద్ధూ గతంలో కూడా పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించారు. అమృత్‌సర్‌లో 'గో గ్రీన్‌, గో క్లీన్‌' అనే కార్యక్రమానికి ఆయన కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.
 

Advertisement
Advertisement