సమస్య పాతదే కానీ.. ఇక ఏ రైతును చావనివ్వొద్దు | Sakshi
Sakshi News home page

సమస్య పాతదే కానీ.. ఇక ఏ రైతును చావనివ్వొద్దు

Published Thu, Apr 23 2015 7:07 PM

సమస్య పాతదే కానీ.. ఇక ఏ రైతును చావనివ్వొద్దు - Sakshi

న్యూఢిల్లీ: భారతదేశంలో రైతుల సంక్షోభం ఇప్పటిది కాదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అది ఎప్పటి నుంచో దేశంలో వేళ్లూనుకుపోయిందని, చాలా విస్తరించిందని చెప్పారు. దీనికి అందరం బాధ్యత వహిస్తూ పరిష్కరించేందుకు ఉమ్మడిగా కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం లోక్ సభలో రైతుల సమస్యలపై గందరగోళం నెలకొనడంతో మోదీ మాట్లాడారు. రైతులు సమస్యల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం అకాల వర్షాలని చెప్పారు. వారినలా వదిలివేయకుండా నాయకులమంతా కలిసికట్టుగా సమస్యను పరిష్కరించాలని చెప్పారు.  చాలాకాలంగా వేధిస్తున్న ఈ సమస్యను పారద్రోలడమే ప్రధాన కర్తవ్యంగా ఎంచుకోవాలని చెప్పిన ఆయన.. రైతుల విషయంలో చేసిన పొరపాట్లను గురించి ఒకసారి పునరాలోచన చేసుకోవాలని నాయకులను కోరారు.

రైతులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు కావాల్సిన సూచనలు, సలహాలతో ఎవరు ముందుకొచ్చినా తాము స్వాగతిస్తామని చెప్పారు. 'చాలా ఏళ్లుగా కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు ప్రస్తుతం తీవ్ర ఆందోళన కరమైనవి. రైతుల ప్రాణం కంటే మనకు విలువైనది ఏదీ లేదు. అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో రైతులకు సాయం చేసేందుకు మేం కృషిచేస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీలో ఓ రైతు ఆత్మహత్య నా హృదయాన్ని ఎంతో బాధించింది. ఇక ఏమాత్రం మనం రైతులను అలా చనిపోనివ్వొద్దు' అని మోదీ చెప్పారు.

Advertisement
Advertisement