నేపాల్‌లో ప్రచండకు ఘోర పరాభవం | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో ప్రచండకు ఘోర పరాభవం

Published Fri, Nov 22 2013 1:12 AM

నేపాల్‌లో ప్రచండకు ఘోర పరాభవం

ఎన్నికల్లో ఓటమి దిశగా మావోయిస్టు పార్టీ
గెలుపు బాటలో నేపాలీ కాంగ్రెస్
 ప్రచండ కుమార్తెకూ తప్పని భంగపాటు

 
 కఠ్మాండు: నేపాల్ యూనిఫైడ్ సీపీఎన్-మావోయిస్టు (యూసీపీఎన్-ఎం) అధినేత పుష్ప కమల్ దహాల్ అలియాస్ ప్రచండకు ఘోర పరాభవం ఎదురైంది. రాజ్యాంగ శాసనసభ ఎన్నికలలో ఆయన పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో ఒకచోట దారుణమైన పరాజయం ఎదురైంది. రాజధాని కఠ్మాండులోని కఠ్మాండు-10 నియోజకవర్గంలో సిట్టింగ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రచండకు కేవలం 12,852 ఓట్లు మాత్రమే రాగా, నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సీ) అభ్యర్థి రాజన్ కేసీ 20,392 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఇక్కడ సీపీఎన్-యూఎంఎల్ అభ్యర్థి సురేంద్ర మణంధర్ 13,615 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి, ప్రచండను మూడో స్థానంలోకి నెట్టేశారు.
 
 2008 ఎన్నికలలో ఇదే నియోజకవర్గంలో రాజన్‌పై భారీ మెజార్టీతో విజేతగా నిలిచిన ప్రచండకు ఈసారి మాత్రం ఘోర పరాభవం తప్పలేదు. అలాగే కఠ్మాండు-1 నియోజకవర్గంలో పోటీచేసిన ప్రచండ కుమార్తె రేణు దహాల్ కూడా ఘోర పరాజయం పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, ఎన్‌సీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ మాన్‌సింగ్ ఆమెపై ఘన విజయం సాధించారు. రాజ్యాంగ శాసనసభకు మంగళవారం జరిగిన ఎన్నికలలో అర్హులైన ఓటర్లు 1.21 కోట్ల మంది (70 శాతం పైగా) ఓటుహక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. కఠ్మాండులో గురువారం ఓట్ల లెక్కింపు మొదలైంది. తుది సమాచారం అందేటప్పటికి సుశీల్ కోయిరాలా నేతృత్వంలోని ఎన్‌సీ 74 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. ప్రత్యర్థి పార్టీ సీపీఎన్-యూఎంఎల్ 54 స్థానాల్లో ముందుకెళ్తోంది. ప్రచండ నేతృత్వంలోని యూసీపీఎన్-ఎం కేవలం 20 స్థానాల్లో మాత్రమే ముందంజతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రచండ పోటీ చేసిన మరో స్థానం సిరాహ నియోజకవర్గం-5లో మాత్రం ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆఖరి సమాచారం ప్రకారం ప్రచండ ముందున్నారు. గురువారం రాత్రి తుది సమాచారం అందేటప్పటికి 40 స్థానాల్లో ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. వాటిలో 19 చోట్ల ఎన్‌సీ, 19 స్థానాల్లో సీపీఎన్-యూఎంఎల్ విజయం సాధించాయి. యూసీపీఎన్-ఎంకు రెండు స్థానాలు లభించాయి. రాజధాని కఠ్మాండులోని పది నియోజకవర్గాల్లో ఐదు చోట్ల ఎన్‌సీ విజయ పతాక ఎగురవేసింది.  
 
 ఎన్నికల రద్దుకు డిమాండ్: ఈ ఎన్నికల తొలి ఫలితాల్లోనే ఘోరమైన ఫలితాలు రావడంతో ప్రచండ పార్టీ నేపాల్ యూనిఫైడ్ సీపీఎన్-మావోయిస్టు స్పందించింది. తమను మూడో స్థానానికి నెట్టేయడానికి ఓట్ల లెక్కింపులో కుట్ర జరిగిందని ఆరోపించింది. ఈ దృష్ట్యా ఓట్ల లెక్కింపు నిలిపేయాలని, ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ప్రచండ మీడియాతో మాట్లాడుతూ, ప్రజాతీర్పును తాము గౌరవిస్తామని, అయితే పోలింగ్‌లో రిగ్గింగ్‌ను, కుట్రలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. నేపాల్‌లో నూతన రాజ్యాంగ నిర్మాణం నిమిత్తం 601 మంది సభ్యుల శాసనసభ ను ఏర్పాటు చేయదలచిన సంగతి తెలిసిందే. వారిలో 240 మందిని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు.335 మం దిని నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఎన్నుకోవాల్సి ఉంది.

Advertisement
Advertisement