Sakshi News home page

ఉడీ అమర జవాన్లు బిచ్చగాళ్లా!

Published Thu, Sep 22 2016 4:02 PM

ఉడీ అమర జవాన్లు బిచ్చగాళ్లా! - Sakshi

దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులు వాళ్లు. జమ్ముకశ్మీర్‌లోని ఉడీలో ఉగ్రవాదులు దొంగదెబ్బ తీయడంతో అసువులు బాసారు. కానీ వారి కుటుంబాలకు పరిహారం అందించి ఆదుకోవడంలోనూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ బుద్ధిని చాటుకున్నాయి. ఉడీ దాడిలో అమరులైన బిహార్‌కు చెందిన జవాన్ల కుటుంబాలకు నితీశ్‌ సర్కారు ఐదు లక్షల పరిహారం ప్రకటించింది. మీ ముష్టి పరిహారం మాకొద్దు అంటూ సైనికుల కుటుంబాలు దానిని నిరాకరించాయి. 'నా భర్త ఏమీ తప్పతాగి డ్రైనేజ్‌లో పడి చనిపోలేదు' అంటూ అమర జవాన్‌ అశోక్‌ కుమార్‌ భార్య నితీశ్‌ సర్కారు పరిహారాన్ని ఘాటుగా తిరస్కరించారు. దీంతో ప్రభుత్వం పరిహారాన్ని రూ. 11 లక్షలకు పెంచింది.

ఇక పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ సర్కారైతే అమర జవాన్ల కుటుంబాలకు కేవలం రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది. ఎంతో ఉదార హృదయంతో సైనికుల కుటుంబాలకు ఓ హోంగార్డు ఉద్యోగాన్ని ఇస్తానని ప్రకటించింది. దీంతో పరిహారాన్ని అమర జవాన్ల కుటుంబాలు నిర్దంద్వంగా తిరస్కరించాయి.


మమత సర్కారు తీరుపై నెటిజన్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. గత ఏడాది మక్కా యాత్ర ప్రమాదంలో చనిపోయిన బాధితుడికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన మమత సర్కారు అమరుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ప్రకటించడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. సీఎంగారు అమరులేమీ బిచ్చాగాళ్లు కాదని ఘాటుగా పేర్కొంటున్నారు. దేశంలోని కుహనా లౌకికవాదానికి, కుహనా రాజకీయాలకు ఇది అద్దం పడుతున్నదని మండిపడుతున్నారు. 'అమరులేమీ బిచ్చాగాళ్లు కాదు' అన్న యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు మమత సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.       

Advertisement

What’s your opinion

Advertisement