గుండెకు మళ్లీ జీవం! | Sakshi
Sakshi News home page

గుండెకు మళ్లీ జీవం!

Published Tue, Sep 8 2015 2:30 AM

గుండెకు మళ్లీ జీవం!

వాషింగ్టన్: మనిషి మరణించాక కూడా వారి గుండె తిరిగి బతికితే..? గుండె జబ్బుతో బాధపడుతున్న మరొకరికి ఆ గుండె ప్రాణదానం చేస్తే..? వీటితోపాటు ఆ మృత శరీరంలోని కాలేయం, కిడ్నీలు వంటి అవయవాలనూ ప్రాణం ఉండేలా చేసి, అవసరమైనవారికి అమర్చగలిగితే..? ఎంతో అద్భుతం కదూ. ఇలా మరణించిన మనిషిలోని గుండెను సైతం తిరిగి కొట్టుకోగలిగేలా చేసే అద్భుతమైన పరికరాన్ని అమెరికాలోని ట్రాన్స్‌మెడిక్స్ సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించారు.

ప్రస్తుతం బ్రెయిన్‌డెడ్ (మనిషి మెదడు మరణించినా.. మిగతా శరీరం, అవయవాలు బతికే ఉండే) వారి నుంచి గుండెను తీసి అవసరమైన వారికి అమర్చుతున్నారు. కానీ మరణించిన మనిషిలోని గుండెకు రక్తాన్ని, పోషకాలను సరఫరా చేసి దానిని తిరిగి కొట్టుకోగలిగేలా శాస్త్రవేత్తలు చేయగలిగారు. అంతేగాకుండా ఆ గుండెను ఆ మృత శరీరంలోనే ఉంచి ఆక్సిజన్‌తో కూడిన రక్తం, పోషకాలను కాలేయం, కిడ్నీలకు అందేలా చేయగలిగారు. తద్వారా ఈ గుండెతో పాటు కాలేయం, కిడ్నీలు కూడా చెడిపోకుండా ఉన్నాయి.

వీటిని అవయవ మార్పిడి అవసరమైన వారికి అమర్చి ప్రాణదానం చేయగలిగారు. ఇలా బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో ఇప్పటికే 15 మంది మరణించినవారి గుండె, ఇతర అవయవాలను తిరిగి బతికించగలిగామని... అవసరమైనవారికి అమర్చామని బ్రిటన్‌లోని పాప్‌వర్త్ ఆస్పత్రి వైద్యుడు స్టీఫెన్ లార్జ్ చెప్పారు. ఈ పరికరం ధర దాదాపు రూ.కోటిన్నర వరకు ఉంటుందని, మనిషి మరణించిన తర్వాత 30 నిమిషాల వరకు కూడా గుండెను తిరిగి కొట్టుకొనేలా చేయవచ్చని పేర్కొన్నారు.

Advertisement
Advertisement