ఓటుకు కోట్లు కేసులో కొత్త పేరు: జిమ్మీకి నోటీసులు | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసులో కొత్త పేరు: జిమ్మీకి నోటీసులు

Published Sat, Jul 4 2015 4:36 PM

ఓటుకు కోట్లు కేసులో కొత్త పేరు: జిమ్మీకి నోటీసులు

ఓటుకు కోట్లు కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు కేసులో ఎక్కడా పేరు బయటపడని 'జిమ్మీ' అనే వ్యక్తికి ఏసీబీ వర్గాలు నోటీసు జారీచేశాయి. సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సెబాస్టియన్ను స్టీఫెన్సన్ వద్దకు తీసుకొచ్చి, ఆయనను పరిచయం చేసిన వ్యక్తే ఈ జిమ్మీ. ఈ విషయాన్ని స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో తెలిపారు. అయితే ఈ కేసు మొత్తమ్మీద జిమ్మీ పాత్ర ఏంటన్న విషయం, అసలు ఈ జిమ్మీ ఎవరన్న విషయం మాత్రం  ఇప్పటివరకు ఎవరికీ తెలియలేదు. అసలు అతడికి రాజకీయాలతో లింకులేంటో, సెబాస్టియన్ ఎలా తెలుసన్న విషయం కూడా బయటపడలేదు. ఈ వివరాలన్నీ ఏసీబీ విచారణలో బయటకొచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ కేసులో ఎవరికి ఎప్పుడు నోటీసులు ఇస్తారన్న విషయం కూడా చిట్ట చివరి నిమిషం వరకు బయటకు పొక్కడంలేదు. ఏసీబీ అధికారులు చాలా పకడ్బందీగా, నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ పేర్లు వెల్లడిస్తున్నారు. గతంలో ఒకటి రెండు పేర్లమీద అనుమానాలు వచ్చినప్పుడు.. ఏసీబీ కావాలనే లీక్ చేస్తోందన్న విమర్శలు వెలువడటంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ముందుగానే పేర్లు బయటకు వస్తే వాళ్లంతా జాగ్రత్త పడతారని, చిట్ట చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతున్నారు. తాము 60 రోజుల్లో చార్జిషీటు దాఖలుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ అంతకు మంచి ఆలస్యమైనా కోర్టు నుంచి అనుమతి తీసుకుని దాఖలు చేస్తామని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement