Sakshi News home page

2019లో మోదీని మట్టికరిపించాలంటే..

Published Mon, Apr 3 2017 8:05 PM

2019లో మోదీని మట్టికరిపించాలంటే.. - Sakshi

పట్నా: ఇటీవలి ఐదురాష్ట్రాల ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయన్న సంగతి మరిచి బీజేపీ అత్యుత్సాహంతో పొంగిపోతున్నదని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీం మోదీని మట్టికరిపించాలంటే జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటు అత్యావశ్యమని జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీ అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ అన్నారు. దేశంలోనే అతి పెద్ద పార్టీగా పేరున్న కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు ఈ మేరకు సమాలోచన జరపాలని కోరారు. సోమవారం పట్నాలో లోక్‌సంవాద్ ‌(ప్రజలతో ముఖాముఖి) కార్యక్రమం అనంతరం కొద్దిసేపు మీడియాతో మాట్లాడిన నితీశ్‌ పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ గెలుపొందడం, మణిపూర్‌, గోవాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించడాన్ని బట్టిచూస్తే గాలి బీజేపీ వైపే వీచిందని చెప్పలేం. ఉత్తరప్రదేశ్‌లోనూ బిహార్‌(జేడీయూ-ఆర్‌జేడీ పొత్తు) తరహా మహా కూటమి ఏర్పాటై ఉండుంటే బీజేపీ ఖచ్చితంగా ఓడిపోయేది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌, బీఎస్పీ పార్టీలు సాధించిన ఓట్ల శాతం బీజేపీకి పడిన ఓట్ల కంటే 10 శాతం ఎక్కువ అన్న విషయాన్ని గమనించాలి. గోవా, మణిపూర్‌ల్లో బీజేపీ ఏర్పాటుచేసింది అతుకుల బొంత లాంటి ప్రభుత్వాలేనని గుర్తుంచుకోవాలి. వచ్చే సర్వాత్రిక ఎన్నికల్లోనైనా బీజేపీ-ఎన్డీఏకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటుచేయాలి. అందుకు కాంగ్రెస్‌ ముందడుగు వేయాలి. నా వంతుగా లెఫ్ట్‌ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నా’ అని నితిశ్‌ చెప్పారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల సంగతి పక్కనపెడితే ఏప్రిల్‌ 23న జరగనున్న ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ) ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌, జేడీయూ, ఆర్‌జేడీ, ఆమ్‌ ఆద్మీ పార్టీలు విడివిడిగా బీజేపీతో తలపడుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించిన నితీశ్‌.. ‘లోకల్‌ ఎన్నికలు వేరు లోక్‌సభ ఎన్నికలు వేరు’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్‌పై లాలూ ప్రసాద్‌ యాదవ్‌(ఆర్జేడీ), మాయావతి(బీఎస్పీ), అరవింద్‌ కేజ్రీవాల్‌(ఆప్‌) తదితరుల లేవనెత్తుతోన్న ఆక్షేపణలు పాతవేనని, ఎన్నికల సంఘమే వీటికి వివరణ ఇవ్వాలని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement