నోట్ల ఎఫెక్ట్: దొంగలకూ బేరాల్లేవు! | Sakshi
Sakshi News home page

నోట్ల ఎఫెక్ట్: దొంగలకూ బేరాల్లేవు!

Published Mon, Nov 14 2016 3:13 PM

నోట్ల ఎఫెక్ట్: దొంగలకూ బేరాల్లేవు! - Sakshi

ఇప్పటికే 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేయడం, కొత్త నోట్లు పెద్దగా ఇళ్లలో ఉండే అవకాశాలు లేకపోవడంతో దొంగలకు కూడా బేరాలు బొత్తిగా తగ్గిపోయాయి. పుణె పరిసర ప్రాంతాల్లో గత ఐదారు రోజులుగా ఒక్కటంటే ఒక్క చోరీ లేదా దోపిడీ ఘటన కూడా నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. పుణె కమిషనరేట్‌ పరిధిలోని మొత్తం 39 పోలీసు స్టేషన్లలో దాదాపు ప్రతిరోజూ సగటున ఐదారు ఫిర్యాదులు వస్తుంటాయి.

గత కొన్ని నెలలుగా రోజూ పోలీసులకు ఇది అలవాటు అయిపోయింది. కానీ ముఖ్యంగా గత ఐదు రోజులుగా మాత్రం ఈ తరహా ఘటనలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు కూడా ఏ పోలీసు స్టేషన్‌కూ రాలేదు. చిట్టచివరి సారిగా నవంబర్ 7వ తేదీ రాత్రి భారతీయ విద్యాపీఠ్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ జరిగింది.  దీనిపై బాధితుడు సంజయ్ జాదవ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తన అపార్టుమెంటులో దొంగలు దూరి, దాదాపు రూ. 75వేల విలువైన నగలు, నగదు దోచుకున్నారని ఆయన చెప్పారు. 
 
ఆ తర్వాత ఇంతవరకు అసలు దొంగతనం, దోపిడీ లాంటి ఘటనలే లేవని జాయింట్ పోలీసు కమిషనర్ సునీల్ రామానంద్ తెలిపారు. రాత్రిపూట పెట్రోలింగ్ పెంచామని, నేరాలను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని మరో సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. అయితే, ప్రధానంగా మాత్రం నోట్ల రద్దు వల్లే దొంగతనాలు తగ్గాయని ఆయన అంగీకరించారు. డబ్బులైతే వెంటనే ఖర్చుపెట్టుకోడానికి వీలుగా ఉంటుందని, అదే బంగారమైతే దాన్ని అమ్మడం కూడా కష్టమని.. వెంటనే దొరికేసే అవకాశం ఉంటుందని, ఇప్పుడు డబ్బులను ఎవరూ ఇళ్లలో పెద్దమొత్తంలో పెట్టుకోవడం లేదు కాబట్టి.. దొంగతనం చేసినా ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో వాళ్లు ఊరుకుంటున్నారని వివరించారు. 

Advertisement
Advertisement