రాష్ట్ర మార్కెట్లోకి నోకియా లూమియా 1320 | Sakshi
Sakshi News home page

రాష్ట్ర మార్కెట్లోకి నోకియా లూమియా 1320

Published Tue, Jan 14 2014 12:50 AM

రాష్ట్ర మార్కెట్లోకి నోకియా లూమియా 1320

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ నోకియా రాష్ట్ర మార్కెట్లోకి లూమియా 1320 మోడల్‌ను విడుదల చేసింది. సోమవారం ఇక్కడి బేగంపేట బిగ్ సి షోరూంలో సినీ తార సమంత ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. బిగ్ సి షోరూంలో లూమియా 1320 ధర రూ.23,999. రూ.2 వేల విలువైన బహుమతులు కూడా పొందవచ్చు. నెలకు రూ.3,999 చొప్పున ఆరు వాయిదాల్లో, 0% వడ్డీతో ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చని బిగ్ సి చైర్మన్ యం.బాలు చౌదరి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ప్రముఖ మొబైల్ బ్రాండ్‌గా పేరున్న నోకియా తన నూతన మోడల్‌ను బిగ్ సి ద్వారా ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. 11 ఏళ్ల విజయప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్నామని చెప్పారు.
 
 ప్రస్తుతం బిగ్ సి ఔట్‌లెట్ల సంఖ్య 121. ఇందులో 50 లైవ్ స్టోర్లున్నాయని తెలిపారు. దశలవారీగా మిగిలిన ఔట్‌లెట్లలో లైవ్ కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తామన్నారు. లైవ్ స్టోర్లలో డమ్మీకి బదులుగా అసలైన ఫోన్లను డిస్‌ప్లే చేస్తున్నట్టు వివరించారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా స్టోర్ల సంఖ్యను 150కి చేరుస్తామని వెల్లడించారు. 2012-13లో రూ.550 కోట్ల వ్యాపారం చేశామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.750 కోట్లు ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. నెలకు 1.50 లక్షల ఫోన్లను బిగ్‌సి విక్రయిస్తోంది.
 

Advertisement
Advertisement