‘గులాబీ’లో పదవుల పండుగ! | Sakshi
Sakshi News home page

‘గులాబీ’లో పదవుల పండుగ!

Published Thu, Aug 13 2015 3:00 AM

‘గులాబీ’లో పదవుల పండుగ! - Sakshi

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు పదవీయోగం దక్కనుంది! శ్రావణ మాసం మొదలు కావడంతోనే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. పదవులకు సంబంధించిన జాబితాల తయారీ బాధ్యతను ఆయా జిల్లా మంత్రులకు అప్పజెప్పారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ శాసన సభాపక్ష సమావేశంలో నాయకులకు ఈ మేరకు హామీ లభించినట్లు తెలిసింది. పార్టీ వర్గాలు అందించిన సమాచారం మేరకు...

ఈ భేటీలో సీఎం కేసీఆర్ నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ కమిటీల ఏర్పాటు, గ్రామజ్యోతి కార్యక్రమంలో కార్యకర్తలను ఎలా మమేకం చేయాలి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బాధ్యతలపై సుమారు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ‘‘శ్రావణ మాసంలో పదవులు భర్తీ చేసుకుందాం. 12 దాకా కార్పొరేషన్లకు పాలక మండళ్లు నియమిస్తా. మరో ముప్పై, నలభై సంస్థల విషయంలో ఏపీ కిరికిరి పెడుతోంది. వీటి తర్వాత దేవాలయ కమిటీలు, తర్వాత మార్కెట్ కమిటీలను భర్తీ చేస్తా.

పార్టీ కమిటీలు కూడా ఖాళీగా ఉన్నాయ్. ఆగస్టు 15 తర్వాత పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలను వేసుకుందాం..’’ అని సీఎం పేర్కొన్నట్టు సమాచారం. జిల్లాల్లో కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు వస్తునాయని, వారిని బాగా చూసుకోవాలని నేతలకు సూచించినట్లు తెలిసింది. మార్కెట్ కమిటీల పాలక మండళ్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటిస్తామని సీఎం తెలిపినట్లు సమాచారం.
 
గ్రామసభల్లో ప్రణాళికల తయారీ

గ్రామీణ ప్రాంతాలను పట్టిపీడిస్తున్న తక్షణ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామజ్యోతి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు పేర్కొ న్న సీఎం.. ప్రణాళికలు తయారు చేసే బాధ్యతను ప్రజాప్రతినిధులకే అప్పజెప్పారు. ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచితో కలసి ప్రతీ గ్రామంలో  గ్రామసభ నిర్వహించి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సమస్యలు, అందుబాటులో ఉన్న నిధులు, సమస్యల ప్రాధాన్య క్రమంలో షెడ్యూల్ తయారు చేసుకోవాలన్నారు.

ప్రధానంగా టాయిలెట్లు, పారిశుధ్యం, డ్రైనేజీల వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. శ్రమధానంతో పూర్తి చేయగలిగిన పనులకు నిధులు వెచ్చించవద్దన్నారు. గ్రామాల్లోని చదు వుకున్న యువకులతో నిరక్షరాస్యులైన వయోజనులకు చదువు చెప్పించాలన్నారు. వీటితో పాటు ఆయా గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, లబ్ధి పొందుతున్నవారి వివరాలూ సేకరించాలన్నారు.
 
ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాల సేకరణ
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ భేటీలో గ్రామజ్యోతిపై మాట్లాడారు. గ్రామజ్యోతిపై కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలనూ సీఎం తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సతీష్, శ్రీనివాస్ గౌడ్, రసమయి బాలకిషన్, బిగాల గణేష్, గువ్వల బాలరాజు, సంజీవరావు, ఎమ్మెల్సీ పూల రవీందర్ తమ అభిప్రాయాలు తెలియజేశారు.
 
గ్రామాలను దత్తత తీసుకోండి
ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో ఒక్కో మండలంలో ఒక గ్రామాన్ని, ఎమ్మెల్సీలు ఏదో ఒక నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జెడ్పీ చైర్‌పర్సన్లు కూడా దత్తత తీసకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అన్ని గ్రామాలను సమాంతరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని, ఈ క్రతువులో పార్టీ శ్రేణులను పూర్తిగా మమేకం చేయాలని పేర్కొన్నారు. ‘‘పార్టీ బావుందా లేదా అన్నది సమస్య కాదు. పథకాలు అద్భుతంగా ఉండాలి. అప్పుడే ప్రజల్లోకి వెళ్తాయి. ప్రజల మనసు దోచుకునేలా పథకాలు అమలు చేయాలి. పనులు చేయాలి. సెప్టెంబరు మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలుంటాయి. అవి ముగిసాక చైనా పర్యటనకు వెళ్లొస్తా...’ అని సీఎం సమావేశంలో చెప్పారు.

Advertisement
Advertisement