ఖండాంతర క్షిపణులు: అమెరికాకు కొరియా షాక్‌! | Sakshi
Sakshi News home page

ఖండాంతర క్షిపణులు: అమెరికాకు కొరియా షాక్‌!

Published Sat, Apr 15 2017 6:22 PM

ఖండాంతర క్షిపణులు: అమెరికాకు కొరియా షాక్‌! - Sakshi

ఉత్తరకొరియా శనివారం తన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలే పంపింది. వార్షిక సైనిక కవాతు సందర్భంగా సరికొత్త క్షిపణులు, వాటి ప్రయోగ వేదికలను ప్రదర్శిస్తూ హల్‌చల్‌ చేసింది. అంతేకాకుండా తొలిసారిగా కొరియా రెండు ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణుల ఆకృతులను కూడా ప్రదర్శనకు పెట్టడం అమెరికాకు షాక్‌కు గురిచేసింది. సబ్‌మెరైన్‌ వేదికగా ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణుల భూతల వెర్షన్స్‌ను సైతం అది ప్రదర్శించింది. ఈ అత్యాధునిక అణ్వాయుధ బలసంపత్తి అంతా తొలిసారిగా ప్రదర్శనకు పెట్టినదేనని అమెరికా రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఉత్తరకొరియా వద్ద ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులు ఉన్నట్టయితే.. అవి నేరుగా అమెరికాలో భూభాగాన్ని, యూరప్‌ను ఢీకొనే అవకాశముంది. ఇక, శనివారం ప్రదర్శనకు పెట్టిన షార్టర్‌ రేంజ్‌బాలిస్టిక్‌ క్షిపణులు ఆసియా ప్రాంతంలోని పలు దేశాలకు సవాల్‌ విసరనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తరకొరియా దుందుడుకుగా అణ్వాయుధ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారస్థాయికి  చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ఆదేశాలతో అమెరికా నేవీ బలగాలు కొరియా ద్వీపకల్పంలో లంగరువేశాయి.


ఈ క్రమంలో అమెరికాకు గట్టి సందేశం ఇచ్చే లక్ష్యంతోనే ఉత్తర కొరియా తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శనకు పెట్టిందని అమెరికా రక్షణ నిపుణుడు, సీనియర్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ మెలిస్సా హన్హమ్‌ తెలిపారు. కొరియా తాజా కవాతులో ప్రదర్శనకు పెట్టిన చాలావరకు క్షిపణులు చాలావరకు గతంలో ఎన్నడూ చూడని వార్డ్‌వేర్‌తో రూపొందినవని, సరికొత్తవని పేర్కొన్నారు. ప్రదర్శనకు ఉంచినవి క్షిపణుల ఆకృతులు మాత్రమేనా? లేక అందులో నిజంగా క్షిపణులు ఉన్నాయా? అన్నది తెలియదని, కానీ, వాటిని గతంలో ఎన్నడూ చూడలేదని హన్హమ్‌ చెప్పారు. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ టు సంగ్‌ 105వ జన్మదినం(డే ఆఫ్‌ది సన్‌) సందర్భంగా పెద్ద మొత్తంలో అణ్వాయుధాలతో, క్షిపణులతో, సైనిక బలగాలతో పెద్ద మొత్తంలో శనివారం పరేడ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.

 

Advertisement
Advertisement