గీత మా కూతురు.. కాదు మా కూతురు! | Sakshi
Sakshi News home page

గీత మా కూతురు.. కాదు మా కూతురు!

Published Sat, Aug 8 2015 1:44 PM

గీత మా కూతురు.. కాదు మా కూతురు!

పొరపాటున తప్పిపోయి ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరాచీలో నివసిస్తున్న భారత బాలిక గీత.. ఎవరి బిడ్డ అనే విషయంపై కొనసాగుతున్న సందిగ్ధత మరింత జటిలమైంది. 15 ఏళ్ల కిందట తప్పిపోయిన తమ కూతురు పూజ అలియాస్ గుడ్డుయే గీత అని పంజాబ్కు చెందిన బధిర దంపతులు పేర్కొనడం తెలిసిందే. కాగా, గీత తమ కూతురే అంటూ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మరో రెండు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి.

ఈ విషయం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి రావడంతో గీత తల్లిదండ్రులను గుర్తించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సుష్మా సూచించారు. ఈ వివరాలను ఆమె శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాము మొత్తం ఏడుగురు సంతానమని, తాము ఒకసారి ఆలయానికి వెళ్లినట్లు తన సంజ్ఞల ద్వారా గీత చెప్పిందని ఆమె అన్నారు. తర్వాత 'వైష్ణోదేవి' అని కూడా రాసినట్లు చెప్పారు. ఈ వివరాలతో గీత ఎవరి కూతురనే విషయాన్ని తెలుసుకుంటామన్నారు. ఆమెను వీలైనంత త్వరగా భారత దేశానికి తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తామని సుష్మాస్వరాజ్ తెలిపారు.

ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లా ధమోహన్ గ్రామానికి చెందిన రామ్రాజ్, అనార దేవి దంపతులు.. టీవీల్లో కనిపించిన గీత తమ బిడ్డేనని, వీలైనంత త్వరగా ఆమెను తమ వద్దకు చేర్చాలని శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. అటు జార్ఖండ్లోని బొకారో జిల్లాలోనూ ఓ కుటుంబం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి గీత తమ కూతురేనని చెప్పింది.

11 ఏళ్ల క్రితం బీహార్లోని చంపారా ఆశ్రమంలో కనిపించకుండా పోయిన తమ బిడ్డ సవితాయే.. గీత అని ఉత్తరప్రదేశ్కు చెందిన దంపతులు చెబుతుండగా, దశాబ్దం కిందట పశువుల్ని మేపేందుకు వెళ్లి తప్పిపోయిన తమ కూతురు కోకియా కుమారినే గీత అని జార్ఖండ్కు చెందిన దంపతులు అంటున్నారు.

15 ఏళ్ల కిందట భారత్లో తప్పిపోయి పాకిస్థాన్ కు చేరుకున్న గీత.. కరాచీలోని ఓ స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతోంది. తిరిగి  మాతృదేశం భారత్ కు రావాలనే ఆమె ఆకాంక్ష  'బజరంగీ భాయిజాన్' సినిమా విడుదలైన తర్వాత మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసిన సంగతి విదితమే.

 

Advertisement
Advertisement