పోలీసులతో సెల్ఫీ పుణ్యమాని.. | Sakshi
Sakshi News home page

పోలీసులతో సెల్ఫీ పుణ్యమాని..

Published Fri, Sep 16 2016 9:06 AM

పోలీసులతో సెల్ఫీ పుణ్యమాని.. - Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్ పోలీసుల సరికొత్త ఆలోచనే 'సెల్ఫీ విత్ కాప్స్'. సోషల్ మీడియాలో ఆకతాయిల ఆట కట్టించేందుకు 'సెల్ఫీ విత్ కాప్స్' పేరుతో రాష్ట్ర పోలీసులు అమ్మాయిలతో సెల్ఫీలు దిగుతున్నారు. అదేంటి పోలీసులతో సెల్ఫీ దిగితే ఆకతాయిలు వదిలిపెడతారా? అనుకుంటున్నారా.. ఆ సెల్ఫీని వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టమని వారు సూచిస్తున్నారు. అంతేకాదు స్టేటస్ లో 'ఇతను మా అన్నయ్య' అని కూడా రాయమని చెబుతున్నారు.

పోలీసుతో ఉన్న ఫోటో ఒక్కటి ఆకతాయిని అడ్డుకోవడానికి సరిపోతుందని అంటున్నారు. అప్పటికీ మాట వినకపోతే.. తమ పద్ధతిలో వారికి బుద్ధి చెబుతామని తెలిపారు.వారం క్రితం మధ్యప్రదేశ్ లోని హూషంగాబాద్ లో ప్రారంభమైన ఈ క్యాంపైన్ కు అమ్మాయిల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటివరకూ 500మందికి పైగా అమ్మాయిలు దగ్గరలోని పోలీసుస్టేషన్ కు వెళ్లి అధికారితో సెల్ఫీలు తీసుకున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న వాట్సాప్ వేధింపుల నిరోధానికి మార్గాలు అన్వేషిస్తున్న సమయంలో ఈ ఆలోచన వచ్చినట్లు హోషంగాబాద్ ఎస్పీ ఏపీ సింగ్ తెలిపారు.

'సెల్ఫీ విత్ కాప్'కు భారీ స్పందన కూడా వస్తోందని పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితం హోషంగాబాద్ జిల్లాలో వాట్సాప్ వేధింపులపై విపరీతంగా కేసులు నమోదయినట్లు వెల్లడించారు. వీటిలో ఆకతాయిలు వేర్వేరు నంబర్ల నుంచి అసభ్య సందేశాలు, చిత్రాలు పంపుతున్నారంటూ నమోదైన కేసులే ఎక్కువని చెప్పారు. ఎస్పీ ఏపీ సింగ్ మాదిరి కొత్త పద్ధతులను అవలంబించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 51 జిల్లాల ఎస్పీలకు డీజీపీ రిషికుమార్ శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో ఉత్తమమైన పద్ధతికి అవార్డు కూడా అందించనున్నారు. ఇప్పటివరకు 12 జిల్లాలకు చెందిన పోలీసులు సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి అమల్లోకి తెచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement