అధికారికంగా విమోచన దినోత్సవం.. | Sakshi
Sakshi News home page

అధికారికంగా విమోచన దినోత్సవం..

Published Mon, Aug 17 2015 3:41 AM

Officially   amortization Day...

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పదాధికారుల సమావేశం డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగింది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా సంపర్క అభియాన్‌లను వినియోగించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

2019 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాల్లో కేంద్రమంత్రులతో సమావేశాలు ఏర్పాటుచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతూనే... రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేసేలా వ్యూహం రూపొందించారు. వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు.
 
సమావేశం  అనంతరం పార్టీనేతలు ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 19, 20 తేదీల్లో యాదాద్రిలో రాష్ట్రస్థాయి కిసాన్ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిర్మాణాత్మకమైన ప్రతిపక్షపార్టీగా పోరాటం చేస్తామన్నారు.

సెప్టెంబరు 17న తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఒత్తిడి తెస్తామన్నారు. రాఖీబంధన్ సందర్భంగా 11 వేల మందితో ప్రధానమంత్రి సురక్షా యోజనను చేపడుతామని చెప్పారు. సమావేశంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.రామచందర్‌రావు, నామాజీ, పార్టీ ప్రధానకార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement