ఇందిర దేశాన్ని జైలుగా మార్చారు | Sakshi
Sakshi News home page

ఇందిర దేశాన్ని జైలుగా మార్చారు

Published Fri, Jun 26 2015 3:39 AM

ఇందిర దేశాన్ని జైలుగా మార్చారు - Sakshi

ఎమర్జెన్సీ రోజులపై ప్రధాని మోదీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలంనాటి ఎమర్జెన్సీ రోజులు దేశం ఎదుర్కొన్న అత్యంత చీకటి రోజులని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆమె అధికార దాహంతో దేశాన్ని గొలుసులతో బంధించి జైలుగా మార్చేశారని విమర్శించారు. స్మార్ట్ సిటీల మిషన్, అటల్ పట్టణ పునరుద్ధరణ పథకాల ఆవిష్కరణ కోసం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌పై, ఆ పార్టీ నేతలపై మోదీ నిప్పులు చెరిగారు.

‘‘1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు దేశం ఎదుర్కొన్న అత్యంత చీకటి రోజులు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజకీయ నాయకత్వం అణగదొక్కింది. పౌర హక్కులను రద్దుచేశారు. ఇందిరాగాంధీని వ్యతిరేకించిన వారందరినీ జైళ్లలో పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మనం వీలైనంతగా కృషి చేద్దాం..’’ అని మోదీ పేర్కొన్నారు.
 
మోదీ వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన కాంగ్రెస్

ఎమర్జెన్సీపై నరేంద్ర మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది.  బీజేపీ నాయకులు అద్వానీ, యశ్వంత్ సిన్హా, వరుణ్ గాంధీ వ్యాఖ్యల్ని పరిశీలిస్తే అధికారం మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్న నాయకుడు మోదీ అని స్పష్టమౌతోందని ఆపార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ అన్నారు. అధికార వ్యామోహంతోనే ఎమర్జెన్సీ విధించారన్న మోదీ వ్యాఖ్యల్ని మాకెన్ కొట్టి పారేశారు. ఎమర్జెన్సీ విషయంలో అద్వానీ వ్యాఖ్యలు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవేనని అన్నారు. అధికార కేంద్రీకరణ అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement