శశికళ అక్రమాస్తులపై రేపు తీర్పులేదు | Sakshi
Sakshi News home page

శశికళ అక్రమాస్తులపై రేపు తీర్పులేదు

Published Sun, Feb 12 2017 4:39 AM

శశికళ అక్రమాస్తులపై రేపు తీర్పులేదు - Sakshi

సోమవారం తీర్పుల జాబితాలో చేర్చని సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సర్వత్రా ఆసక్తిగా నెలకొన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పును సుప్రీం కోర్టు సోమవారం కూడా వెలువరించడంలేదు. ఆరోజు కేసుల జాబితాలో దీనిని చేర్చలేదు. ఈ కేసులో తీర్పుపైనే శశికళ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. జయ అక్రమాస్తుల కేసులో శశికళ రెండో నిందితురాలిగా ఉన్నారు.

అయితే జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. వారంలో తీర్పు వెలువరిస్తామని ఈనెల 6న చెప్పిన నేపథ్యంలో ఈ వారంలోనే తీర్పు వెలువడవచ్చని భావిస్తున్నారు. ఈ కేసులో శశికళ బంధువులు వీఎన్‌ సుధాకరన్, ఇళవరసి కూడా నింధితులుగా ఉన్నారు. కాగా, శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌పై విచారణను ఈనెల 17 సుప్రీం కోర్టు చేపట్టనుంది.  

అమ్మ మిత్రుల మద్దతు పన్నీర్‌కే!  
సాక్షి, చెన్నై: సీఎం పదవికి అన్నాడీఎంకేలో ఎవరు అర్హులో అన్న విషయంలో తమ మద్దతు పన్నీరుకేనని జయలలిత స్కూల్‌మేట్స్‌ ప్రకటించారు. జయలలితతో కలిసి చెన్నై చర్చ్‌పార్కు స్కూల్లో చదువుకున్న మిత్రులు ముగ్గురు శనివారం ఓ మీడియాతో మాట్లాడారు. శ్రీమతి అయ్యంగార్‌ మాట్లాడుతూ 1980 వరకు జయలలితతో తాను మాట్లాడినట్లు చెప్పారు. శశికళ రాకతో జయలలితకు దూరం కావాల్సి వచ్చిందని తెలిపారు. రాజకీయాల్లో తనకంటూ ఓ వారసుడ్ని జయలలిత ముందుగానే ప్రకటించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

అయితే, జయలలిత మదిలో తప్పకుండా పన్నీర్‌సెల్వంకు మంచి గుర్తింపు, స్థానం ఉందని తెలిపారు. శశికళ కంటే, పన్నీర్‌సెల్వం ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకం ఉందని, అందుకే తన మద్దతు ఆయనకేనని స్పష్టం చేశారు. తాను ఓ ట్రావెల్స్‌ సంస్థను నడుపుతున్నట్టు మరో స్నేహితురాలు శాంతిని పంకజ్‌ చెప్పారు. తన పిల్లలంటే జయకు ఎంతో ఇష్టమని, తన కోసం మూడుసార్లు ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. 2005 వరకు జయలలిత సన్నిహిత సంబంధాలు కొనసాగినట్టు వివరించారు. తదుపరి శశికళ వల్ల జయకు దూరం కావాల్సివచ్చిందని,  ఆ తర్వాత పన్నీర్‌ సెల్వం ద్వారా ఓ సారి జయలలితను కలిసే అవకాశం దక్కిందని తెలిపారు. శశికళ రూపంలో పార్టీకి మంచి జరుగుతుందో ఏమోగానీ, ప్రజలకు మంచి జరగాలంటే, పన్నీర్‌ సెల్వం సీఎంగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. జయలలితకు నమ్మకస్తుడు పన్నీర్‌ సెల్వం అని, సీఎం పదవికి అర్హుల విషయంలో తన మద్దతు ఆయనకే అని పదర్‌ సయ్యద్‌ అనే మిత్రుడు స్పష్టం చేశారు.

ప్రజాభీష్టం మేరకే పన్నీర్‌కు మద్దతు: స్పష్టం చేసిన మంత్రి పాండియరాజన్‌
సాక్షి, చెన్నై : ప్రజాభీష్టం మేరకు ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌కు మద్దతు ప్రకటించినట్టు విద్యాశాఖ మంత్రి పాండియరాజన్‌ తెలిపారు. చెన్నై గ్రీన్‌వేస్‌ రోడ్డులోని పన్నీర్‌ సెల్వం నివాసానికి చేరుకుని శనివారం ఉదయం మద్దతు ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పన్నీర్‌కు మద్దతుగా నిలవాలని తన నియోజకవర్గ ప్రజల నుంచి ఏడువేల మెసేజ్‌లు అందాయని చెప్పారు. ప్రజాభీష్టం మేరకే పన్నీర్‌కు మద్దతివ్వడానికి ముందుకు వచ్చానని తెలిపారు. అమ్మ జయలలిత నమ్మిన బంటుగా, విశ్వాసానికి ప్రతిరూపంగా ఉన్న పన్నీర్‌ సెల్వం ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. పార్టీని చీల్చడం ఎవరి తరం కాదని, శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ తప్పకుండా పన్నీర్‌కు మద్దతుగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. శశికళ సీఎం కావడం అసాధ్యమని తెలిపారు.

సీబీఐ విచారణకు పట్టు: ఎంపీలు
అమ్మ జయలలిత మరణం వెనుక మిస్టరీ ఉందని, దీనిపై సీబీఐ విచారణ తప్పనిసరి అని అన్నాడీఎంకే ఎంపీలు సుందరం, అశోక్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. నామక్కల్‌ ఎంపీ సుందరం, కృష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్‌ పన్నీర్‌ సెల్వంకు మద్దతు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇది ఆరంభం మాత్రమేనని, తంబిదురై తప్ప, మిగిలిన ఎంపీలందరూ పన్నీర్‌కు మద్దతు ప్రకటించేందుకు ఇక్కడికి రాబోతున్నారని ప్రకటించారు. తమ అమ్మ జయలలిత మరణం వెనుక మిస్టరీ ఉందని, దీనిపై సీబీఐ విచారణ సాగించాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు. అడ్డదారిలో సీఎం పదవిలోకి రావాలని శశికళ ప్రయత్నించారన్నారు. ఆమె పన్నాగాలను పన్నీర్‌ తిప్పికొట్టడం ఆహ్వానిస్తున్నామని తెలిపారు. నర్సు డాక్టర్‌ అయ్యేందుకు వీలుందా? ఆయమ్మ సీఎం అయ్యేందుకు ఏ అర్హతలు ఉన్నాయని ప్రశ్నించారు.

ప్రజలు కోరుకుంటున్నారు: పొన్నయ్యన్‌
పన్నీర్‌ సెల్వం నేతృత్వంలో అన్నాడీఎంకేకు మంచి భవిష్యత్తు ఉందని అన్నాడీఎంకే  సీనియర్‌ నేత పొన్నయ్యన్‌ చెప్పారు. ప్రజలందరూ ఆయనే సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నారని తెలిపారు. అనుభవజ్ఞుడు, రెండుసార్లు సీఎంగా పనిచేసిన పన్నీర్‌ సెల్వం సమర్థవంతంగా రాణిస్తారన్న నమ్మకం ఉందన్నారు. పురట్చి తలైవర్, తలైవి మార్గంలో అన్నాడీఎంకే బలోపేతం పన్నీర్‌ నేతృత్వంలోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఆయనకు కోటిన్నర మంది కార్యకర్తలు మద్దతు ప్రకటిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక శిబిరాల్లో ఉన్న వాళ్లందరూ తప్పకుండా పన్నీర్‌కు మద్దతుగా ముందుకు వస్తారని ధీమా వ్యక్తంచేశారు.

శాశ్వత సీఎం పన్నీర్‌: ఎంపీ సత్యభామ
అమ్మ జయలలిత ఆశయ సాధన పన్నీర్‌ ద్వారానే సాధ్యం అవుతుందని తిరుప్పూర్‌ ఎంపీ సత్యభామ చెప్పారు. విధేయతకు ప్రతీరూపంగా ఉన్న పన్నీర్‌కు అమ్మ రెండుసార్లు సీఎం పదవి అప్పగించారని గుర్తు చేస్తూ, అన్నాడీఎంకేకు  ఇక శాశ్వత సీఎం ఆయనేనని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement