నాడు హంతకుడు.. నేడు ఓ కంపెనీ సీఈవో | Sakshi
Sakshi News home page

నాడు హంతకుడు.. నేడు ఓ కంపెనీ సీఈవో

Published Mon, Dec 26 2016 9:08 PM

నాడు హంతకుడు.. నేడు ఓ కంపెనీ సీఈవో

సోమర్‌విల్లె: మార్పు రాని వాడు మనిషే కాదు. హత్య కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తిలో జైలు జీవితం మార్పును తీసుకొచ్చింది. అది ఎంతలా అంటే ఓ కంపెనీకి సీఈవో అయ్యేంతలా. నమ్మలేకపోయినా ఇది నిజం. పదహారు సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిన జాన్ వల్వర్ధె జైలులోని రెండు డిగ్రీలు సాధించారు. 20 ఏళ్ల క్రితం అంటే 1991లో జాన్ ప్రేయసి తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. అంతుచిక్కని కోపంతో అతగాడి వద్దకు వెళ్లిన జాన్ తుపాకీతో కాల్చి చంపాడు. 
 
దీంతో జాన్ కు కోర్టులో 16ఏళ్ల జైలు శిక్ష పడింది. రోజులు గడుస్తున్న కొద్దీ జైలు వాతావరణం జాన్ లో ఏదో సాధించాలనే తపనను రగిల్చింది. అందుకు మార్గం విద్యేనని ఓ నిర్ణయానికి వచ్చాడు. ప్రవర్తనా శాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్న జాన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. తాను చేసింది. తాను చేసింది దిద్దుకోలేని తప్పని తనకు తెలుసని, చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి కాబట్టి అందుకు తానేమీ బాధపడడం లేదని, కాకపోతే జీవితంలో కొన్ని సంవత్సరాల విలువైన సమయం, స్వేచ్ఛ కోల్పోయి బతకడం ఎంత కష్టమో తనకి అర్థమయిందని జాన్‌ పేర్కొన్నాడు. 2008లో జైలు నుంచి విడుదలైన జాన్.. లాభాపేక్షలేని సేవా సంస్థలో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
జైల్లో ఉన్నప్పుడే తోటి ఖైదీలకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ పట్ల అవగాహన కల్పిస్తూ, చదువు విషయంలో కూడా మెలకువలు నేర్పిస్తూ ఖైదీలందరికీ ఆదర్శంగా నిలిచేవాడు‌. ఏడేళ్ల పాటు ఖైదీలు, మాజీ ఖైదీలకు చికిత్స, విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ అందించే ఆస్బోర్న్ అనే సంస్ధలో పని చేశాడు. 
 
సీఈవోగా ఎంపిక..
ఆస్బోర్న్ నుంచి బయటకు వచ్చిన జాన్.. యూత్ బిల్డ్ అనే స్వచ్చంద సేవా సంస్ధలో చేరాడు. అమెరికా 1978లో ప్రారంభమైన యూత్ బిల్డ్.. చదువు మధ్యలో ఆపేసినవారు, ఉద్యోగం, వృత్తినైపుణ్యం లేనివారు, నిరుపేద కుటుంబాలవారు, అనాథలు, నేరచరిత్ర ఉన్నవారు తదితరులకు వారి చదువు కొనసాగిస్తూ వృత్తి శిక్షణ పొందేందుకు సహకరిస్తుంది. యూత్ బిల్డ్ 21 ఇతర దేశాల్లో కూడా తన సేవా కార్యక్రామాలను విస్తృతం చేసింది.
 
సేవా కార్యక్రమాలనే తన పరమావధిగా భావించే జాన్.. యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి తానే ఉదాహరణ అని చెబుతారు. యూత్ బిల్డ్ సీఈవో పోస్టుకు జరుగుతున్న ఇంటర్వూల్లో పాల్గొన్న జాన్.. 124 మందిని ఓడించి ఎంపికయ్యాడు. నేరం చేయడం తప్పే.. దాన్ని ఒప్పుకొని జీవితాన్ని తిరిగి నిర్మించుకోవాలని అంటాడు జాన్.

Advertisement

తప్పక చదవండి

Advertisement