టీ బిల్లుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల భిన్నాభిప్రాయాలు | Sakshi
Sakshi News home page

టీ బిల్లుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల భిన్నాభిప్రాయాలు

Published Sun, Feb 2 2014 2:05 AM

opinions on t.bill

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013పై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివా రం ఇక్కడ జరిగిన ఓ సమావేశానికి హాజరైన వీరు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత బిల్లుపై రాష్ట్రపతి సుప్రీం కోర్టు సలహా కోరవచ్చని, లేదా మంత్రివర్గ నిర్ణయాన్ని ఆమోదించవచ్చని సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది టి.ఆర్.అంద్యార్జున మరో అభిప్రాయం వెలిబుచ్చారు. రాష్ట్రపతి మంత్రిమండలి నిర్ణయం మేరకు నడుచుకోవాల్సిందేనని చెప్పారు. బిల్లు సమగ్రతపై మాత్రమే ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని మరో సీనియర్ న్యాయవాది పీపీ రావు తెలిపారు.
 రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా పొందవచ్చు: నారీమన్
 
 ‘‘తెలంగాణ బిల్లుపై నిర్ణయం తీసుకొనేందకు రాష్ట్రపతి వద్ద రెండు మార్గాలు ఉన్నాయి. బిల్లుపై సుప్రీం కోర్టు సలహా కోరవచ్చు. లేదంటే నేరుగా మంత్రివర్గం నిర్ణయం మేరకు నడుచుకోవచ్చు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కేంద్రం రాష్ట్ర అధికారాలను కూడా తీసుకుని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు. ఆర్టికల్ 3 ఇందుకు పూర్తి అధికారం ఇచ్చింది. బిల్లు అసమగ్రంగా ఉందనడం సరికాదు. ఎలా అయినా పంపొచ్చు. ఆర్థిక మెమోరాండం వంటివి లేకపోయినా పరవాలేదు.’’
 
 బిల్లు తీరుపై ఇప్పుడు కోర్టుకు వెళ్లొచ్చు: పీపీ రావు
 
 ‘‘బిల్లుపై రాష్ట్రపతి న్యాయ సలహా తీసుకోవచ్చు. లేదా ఆయనకు తోచిన అభిప్రాయాన్ని మంత్రిమండలికి చెప్పొచ్చు. కానీ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం మాత్రమే నడుచుకోవాల్సి వస్తుంది. సుప్రీం కోర్టు సలహా తీసుకోవడం ఒక మార్గం మాత్రమే. ప్రస్తుత తరుణంలో బిల్లు సమగ్రంగా ఉందా లేదా అనే అంశంపై మాత్రమే సుప్రీం కోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లుపై వెళ్లలేం. చట్టరూపం దాల్చాక బిల్లుపై కూడా వెళ్లవచ్చు.’’
 
 రాష్ట్రపతి పాత్ర ఏమీ లేదు: టి.ఆర్.అంద్యార్జున
 
 ‘‘అసెంబ్లీ తిరస్కరించినా పార్లమెంటు బిల్లును ఆమోదించవచ్చు. ఇక్కడ రాష్ట్రపతి పాత్ర కూడా ఏమీ ఉండదు. కేంద్ర మంత్రి మండలి నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సిందే. కేంద్రం దానంతట అదే వెనక్కి తీసుకుంటే తప్ప బిల్లు ఆగకపోవచ్చు. పైగా, బీజేపీ కూడా మద్దతిస్తోంది. తెలంగాణ ప్రజలు 50 ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు. ప్రజలు కోరుకుంటే ప్రత్యేక రాష్ట్రమివ్వడంలో తప్పేమీలేదు.’’

Advertisement

తప్పక చదవండి

Advertisement