జగన్ దీక్షకు మా మద్దతు: దిగ్విజయ్ | Sakshi
Sakshi News home page

జగన్ దీక్షకు మా మద్దతు: దిగ్విజయ్

Published Wed, Oct 14 2015 12:29 AM

జగన్ దీక్షకు మా మద్దతు: దిగ్విజయ్ - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షకు తమ మద్దతు ఉంటుందని, ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సిద్ధమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న పలు ప్రయోజనాలతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై స్పష్టంగా మద్దతు పలికింది. పార్లమెంట్‌లో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చేలా చేస్తానని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ అంశాన్ని మరిచిపోతున్నారు.

ఆయన రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. మాకు జగన్‌మోహన్‌రెడ్డితో విభేదాలు ఉన్నప్పటికీ.. ఆయన ప్రత్యేక హోదాపై చేసిన దీక్షకు మద్దతు ఇస్తున్నాం. ప్రాణాలను పణంగా పెట్టరాదని జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి రాష్ట్రంలో ప్యాకేజీ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రధానమంత్రి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని, చంద్రబాబు కూడా అలా చేయడంలో నిపుణుడని విమర్శించారు.

 కేసీఆర్‌కు కుటుంబ సభ్యులే ముఖ్యం
 తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై దిగ్విజయ్‌సింగ్ స్పందించారు. ‘‘మేం ఈ అంశంపై పోరాడుతున్నాం. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు మా విజ్ఞప్తి ఏంటంటే.. కేసీఆర్ కుటుంబ పాలన, నియంతృత్వ పాలనపై పోరాడాలి. కేసీఆర్‌కు ఆయన కుటుంబ సభ్యులే ముఖ్యం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చలేదు. కేసీఆర్, చంద్రబాబు, నరేంద్రమోదీ.. ముగ్గురూ తప్పుడు హామీలు ఇవ్వడంలో, ప్రజలను పిచ్చోళ్లను చేయడంలో నిపుణులు’’ అని మండిపడ్డారు.

Advertisement
Advertisement