ఏడాదిలో 34 వేలకు పైగా అత్యాచారాలు! | Sakshi
Sakshi News home page

ఏడాదిలో 34 వేలకు పైగా అత్యాచారాలు!

Published Tue, Aug 30 2016 8:15 PM

ఏడాదిలో 34 వేలకు పైగా అత్యాచారాలు! - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై దాడులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా 34,600 రేప్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధిక లైంగిక దాడులతో రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌ ముందు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది. కామాంధుల కోరల్లో చిక్కుకున్న వారిలో ఆరేళ్ల పాప నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకు ఉన్నారు. 2015లో మొత్తంగా 34,651 రేప్‌ కేసులు నమోదవ్వగా, అందులో 33,098 కేసుల్లో అత్యాచారానికి పాల్పడ్డవాళ్లు బాధితురాలికి తెలిసినవారే కావడం గమనార్హం.

4,391 రేప్‌ కేసులో మధ్యప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉండగా, 2,199 రేప్‌ కేసులతో దేశ రాజధాని కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాల విషయంలో మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా గత సంవత్సరం మహిళలపై 3.27 లక్షల నేరాలు జరుగగా, అందులో 1.3 లక్షల కేసులు లైంగిక నేరాలకు సంబంధించినవే. రేప్‌ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర (4,144), రాజస్థాన్‌ (3,644), ఉత్తరప్రదేశ్ (3,025) ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 1027 రేప్‌ కేసులు నమోదవ్వగా, తెలంగాణలో 1105 లైంగిక దాడులు జరిగాయి.

నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్
ఇక దేశవ్యాప్తంగా దళితులపై దాడుల అంశం కలకలం రేపుతూనే ఉంది. గత ఏడాది రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్‌లో దళితులపై దాడులు ఎక్కువగా జరిగాయి. యూపీలో 8,358 దాడి కేసులు నమోదవ్వగా, ఆ తర్వాత రాజస్థాన్‌లో 6,998, బిహార్‌లో 6438 దాడులు జరిగాయి. దళితులపై దాడుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. ఏపీలో గత ఏడాది 4415 దాడులు దళితులపై జరిగాయి.

ఈ మేరకు గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన నేరాల వివరాలతో కూడిన 'క్రైమ్ ఇన్‌ ఇండియా-2015' వార్షిక నివేదికను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం విడుదల చేశారు. 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు, 10 లక్షలకుపైగా జనాభా ఉన్న 53 మెగా నగరాల నుంచి వివరాలు సేకరించి.. జాతీయ నేరనమోదు బ్యూరో తాజాగా తన 69వ ఎడిషన్‌ను ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం 2015లో షెడ్యూల్డ్‌ తెగలపై జరిగిన నేరాలు 4.7శాతానికి తగ్గాయి. ఎస్సీలపై నేరాలు 4.4శాతం తగ్గగా, మహిళలపై నేరాలు 3.1శాతం తగ్గాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement