దయచూపని పాకిస్థాన్‌.. | Sakshi
Sakshi News home page

దయచూపని పాకిస్థాన్‌..

Published Mon, Jul 10 2017 11:33 PM

దయచూపని పాకిస్థాన్‌..

- జాదవ్‌ తల్లికి వీసాకు నో...  మండిపడ్డ సుష్మా స్వరాజ్‌
న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ తల్లి అవంతికకు పాకిస్థాన్‌ వీసా నిరాకరించడంపై విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌ మండిపడ్డారు.  అవంతికా జాదవ్‌కు వీసా ఇవ్వాలని స్వయంగా తానే పాకిస్థాన్‌ను కోరినా ఆ దేశం మాత్రం స్పందించడం లేదని సుష్మ ఆదివారం విమర్శించారు. తన కుమారున్ని చూడాలనుకుంటున్న జాదవ్‌ తల్లికి పాక్‌ వీసా ఇవ్వకపోవడాన్ని  తప్పుపట్టారు.

అయితే ఓ పాకిస్థానీకి మాత్రం తాను మెడికల్‌ వీసా ఇప్పించినట్లు ఆమె ట్వీట్‌ చేశారు. మెడికల్‌ వీసా కోరుకుంటున్న పాకిస్థానీల పట్ల తనకు సానుభూతి ఉందని,  పాక్‌ మాత్రం ఇదే విధంగా స్పందించడం లేదన్నారు. పాక్‌ విదేశాంగమంత్రి సర్తాజ్‌ అజీజ్‌కు లేఖ రాసినా ఆయన కనీసం స్పందించలేదని ఆక్షేపించారు. గత ఏడాది జాదవ్‌ను పాకిస్థాన్‌ అరెస్టు చేయడం తెలిసిందే. దేశద్రోహం కేసులో పాక్‌ మిలిటరీ కోర్టు అతనికి మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆదివారం పాకిస్థాన్‌కు చెందిన ఫైజా తన్వీర్‌ అనే తనకు మెడికల్‌ వీసా ఇప్పించాలని ట్విటర్‌ ద్వారా సుష్మ కోరారు. ఇందుకు ఆమె అనుకూలంగా స్పందించారు. ఏటా ఏడాది దాదాపు 500 మంది పాకిస్థానీలు వైద్యం కోసం భారత్‌ వస్తున్నారు.

ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్‌: ఉత్తర కశ్మీర్‌లోని నౌగాం సెక్టార్‌ నుంచి దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం కాల్చిచంపింది. ఆదివారం రాత్రి నౌగాం సెక్టార్‌ అనుమానిత కదలికలను గుర్తించామని సైనిక విభాగం అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు. , భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల మరణించారని చెప్పారు. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకుగాను అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నామన్నారు.

అన్ని సమస్యలూ పరిష్కారం కావాలి : పాక్‌
ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ సహా అన్ని అంశాలపై భారత్‌తో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు పాకిస్థాన్‌ ప్రకటించింది. కశ్మీరీలు స్వాతంత్య్రం పొందే వరకు వారికి అన్ని విధాలా సహాయసహకారాలు అం దిస్తామని పాక్‌ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ ప్రకటించారు. ఆదివారం ఆయన ఒక వార్తా చానెల్‌తో మాట్లాడుతూ కశ్మీరీ లకు భారత్‌ విముక్తి కల్పించాలని సూచించారు. గత ఏడాది హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ మృతి తరువాత కశ్మీరీలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగాయం టూ అజీజ్‌ భారత్‌పై మండిపడ్డారు.

Advertisement
Advertisement