సరిహద్దులో పాకిస్తాన్ ఫిరంగులు | Sakshi
Sakshi News home page

సరిహద్దులో పాకిస్తాన్ ఫిరంగులు

Published Tue, Feb 21 2017 11:37 AM

సరిహద్దులో పాకిస్తాన్ ఫిరంగులు - Sakshi

ఇస్లామాబాద్‌: ఉగ్రవాదులపై పోరును ఉధృతం చేసిన పాకిస్తాన్‌ తాజాగా అఫ్గానిస్తాన్‌ సరిహద్దుల్లో భారీ ఫిరంగులను మొహరించినట్లు తెలిసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా ఈ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా సోమవారం చెప్పారు. పాక్‌లో గతవారం జరిగిన వివిధ ఉగ్రదాడుల్లో 100 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇటీవల జరిగిన దాడులకు బాధ్యులైన ఉగ్రవాద సంస్థ అఫ్గానిస్తాన్‌ నుంచే కార్యకలాపాలు సాగిస్తోందని పాకిస్తాన్‌ అంటోంది. పాక్‌ భద్రతా దళాలు 130 మందికి పైగా ఉగ్రవాదులను గతవారంలో హతమార్చాయి.

సింద్‌ రాష్ట్రంలోని సెహ్వాన్‌లో సూఫీ మత గురువు లాల్‌ షాబాజ్‌ ఖలందర్‌ ప్రార్థనా మందిరంలో గురువారం జరిగిన మానవబాంబు దాడిలో 80 మంది మరణించగా, మరో 250మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేతపై పాకిస్తాన్ పోరాటాన్ని ఉధృతం చేసింది. 130 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 350 మందిపైగా అరెస్ట్ చేసింది. వీరిలో అత్యధికులు అఫ్గానిస్తాన్‌ పౌరులు ఉండడంతో సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఛమన్, తొర్కామ్‌ జిల్లాల్లో సరిహద్దు వెంబడి భారీ సంఖ్యలో ఫిరంగులు మొహరించింది.

Advertisement
Advertisement