ఐదో అణ్వాయుధ శక్తిగా పాక్! | Sakshi
Sakshi News home page

ఐదో అణ్వాయుధ శక్తిగా పాక్!

Published Thu, Oct 22 2015 11:57 AM

ఐదో అణ్వాయుధ శక్తిగా పాక్! - Sakshi

వాషింగ్టన్: శరవేగంగా అణ్వాయుధ సంపదను పోగుచేసుకుంటున్న పొరుగుదేశం పాకిస్థాన్.. 2025నాటికి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద అణ్వాయుధ శక్తిగా మారనుంది. భారత్ దాడులను ఎదుర్కొనేందుకే తాము స్వల్పశ్రేణి అణ్వాయుధాలు అభివృద్ధి చేసినట్టు పాకిస్థాన్ బుధవారం ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అత్యున్నత మేధోసంస్థ ఒకటి ఈ విషయాన్ని తెలియజేసింది.

'పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 110 నుంచి 130 వరకు అణ్వాయుధాలు నిల్వ ఉన్నాయి. 2011లో ఆ దేశం వద్దనున్న అణ్వాయుధాలు సంఖ్య 90 కాగా, ప్రస్తుతం 110కి చేరింది. పస్తుతం మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి. ప్లుటోనియంను ఉత్పత్తి చేసే నాలుగు రియాకర్లు, యూరేనియం కర్మాగారాలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న పదేండ్లలో పాకిస్థాన్ అణ్వాయుధ నిల్వ గణనీయంగా పెరుగనుంది. అయితే, ఈ పెరుగదల ఏ స్థాయిలో ఉంటుందనేది చాలావాటిపై ఆధారపడి ఉంది' అని ఆ సంస్థ పేర్కొంది. 'పాకిస్థాన్ న్యూక్లియర్ ఫోర్సెస్ 2015' పేరిట హాన్స్ ఎం క్రిస్టన్‌సన్, రాబర్ట్ ఎస్ నొరిస్ ఈ నివేదిక రూపొందించారు.

పాకిస్థాన్ పది స్వల్పశ్రేణి వ్యూహాత్మక అణ్వాయుధాలను అభివృద్ధి చేసిందని నివేదిక పేర్కొంది. భారత్‌ భూమార్గం ద్వారా యుద్ధానికి పాల్పడితే ఈ అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పాకిస్థాన్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఈ అణ్వాయుధాలలో ఒకదాని స్థాయి కేవలం 60 కిలోమీటర్లు మాత్రమే. ఈ అణ్వాయుధం ఉద్దేశం భారత్‌లోని నగరాలను, మిలిటరీ స్థావరాలను బెదిరించడానికే కాదు.. ఇది యుద్ధంలో వినియోగించడానికి ఉద్దేశించినది. పాక్‌పై భారత్ దాడిని ఎదుర్కొనేందుకు అది దీనిని ఉపయోగించవచ్చు' అని ఎం క్రిస్టన్‌సన్ మీడియాకు తెలిపారు.

Advertisement
Advertisement