పన్నీర్‌ సెల్వానికి అనూహ్య మద్దతు! | Sakshi
Sakshi News home page

పన్నీర్‌ సెల్వానికి అనూహ్య మద్దతు!

Published Thu, Feb 9 2017 11:13 AM

పన్నీర్‌ సెల్వానికి అనూహ్య మద్దతు! - Sakshi

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి అనుకోని రూపంలో గట్టి మద్దతు దొరికింది. అన్నాడీఎంకేకు చెందిన ఐటీ విభాగం ఆయనకు దన్నుగా నిలిచింది. దాంతోపాటు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మరికొందరు కూడా అనుక్షణం ఓపీఎస్‌కు అండగా ఉంటూ ట్వీట్లు, పోస్టింగులతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు శశికళ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల ఆచూకీ తెలియడం లేదని, వాళ్లంతా అదృశ్యం అయ్యారని పీఎంకే న్యాయవాది బాలు మద్రాస్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుమోటోగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని కోరారు. అదే జరిగితే ప్రస్తుతం క్యాంపు రాజకీయాలు నడుపుతున్న శశికళకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.
 
అన్నాడీఎంకే అధికారిక ఐటీ విభాగంలో కీలకంగా వ్యవహరించే హరి ప్రభాకరన్, శ్రీరామ్ తదితరులు పన్నీర్‌ సెల్వానికి అనుకూలంగా ట్వీట్లు మోతెక్కిస్తున్నారు. తాజాగా మొత్తం ఎమ్మెల్యేలందరి ఫోన్ నంబర్ల జాబితాను ట్వీట్ చేస్తూ.. పన్నీర్ సెల్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వాళ్లకు సందేశాలు పంపాలని ప్రజలను కోరుతున్నారు. తాను ఓపీఎస్‌కు పూర్తి మద్దతు చెబుతున్నానని, మిగిలినవాళ్లు కూడా అలాగే చేయాలని హరిప్రభాకరన్ తెలిపారు. 
 
కాగా ఐటీ విభాగం, ఇతరులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఎమ్మెల్యేల నంబర్లు భారీగా షేర్ అయ్యాయి. దాంతో ఆ జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు, మెసేజిలు విపరీతంగా వెళ్తున్నాయని తెలుస్తోంది. శశికళ క్యాంపు నుంచి 26 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారని, వాళ్లంతా పన్నీర్‌కు మద్దతు పలుకుతున్నారని ట్వీట్లలో చెబుతున్నారు. మిగిలినవాళ్లు కూడా ఎక్కడున్నా అందరూ ఆయనకు మద్దతుగా ఓటేయాలని పిలుపునిస్తున్నారు. దీంతో షాక్ తిన్న శశికళ వర్గం.. తమ ఐటీ విభాగం అధినేత సింగై జి రామచంద్రన్‌ను తొలగించి, ఆయన స్థానంలో వీవీఆర్ రాజ్ సత్యంను నియమించింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. సోషల్ మీడియాలో పన్నీర్ సెల్వం హీరోగా మారిపోయారు. 

Advertisement
Advertisement