నిలిచిపోయిన పారామెడికల్ రిజిస్ట్రేషన్‌లు | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన పారామెడికల్ రిజిస్ట్రేషన్‌లు

Published Wed, Jul 29 2015 1:07 AM

Paramedical and pending registrations

హైదరాబాద్: సర్కారు నిర్వాకం కారణంగా వందలాదిమంది పారామెడికల్ అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయాయి. గత మూణ్నెల్లుగా ఏపీకి చెందిన ఒక్క అభ్యర్థి రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. మొన్నటి వరకూ ఏపీ పారామెడికల్ బోర్డు ఉండేది.  మూణ్నెల్ల కిందట ఏపీ పారామెడికల్ బోర్డు తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లగా ఏపీ నర్సింగ్ కౌన్సిల్ ఏపీ ఆధీనంలోకి వచ్చింది. అయితే తెలంగాణలో నర్సింగ్ కోర్సులు చేసిన వారు ఏపీ కౌన్సిల్‌లో నమోదు చేయించుకుంటున్నప్పటికీ ఏపీకి చెందిన పారామెడికల్ అభ్యర్థులకు పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.

రోజూ వివిధ జిల్లాలనుంచి అనేకమంది అభ్యర్థులు హైదరాబాద్‌కు వచ్చి వెనుదిరిగి పోతున్నారు. రాష్ట్రంలో కొత్తగా పారామెడికల్ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ఫైలు మంత్రికి పంపించి నెలరోజులు గడిచినా అతీగతీ లేదు. డీఎంఎల్‌టీ, డీసీఎల్‌టీ, డీఆర్‌టీటీ, డీఎంఎస్‌టీ, డీఎంఎస్ తదితర కోర్సులు పూర్తి చేసిన వాళ్లందరూ రిజిస్ట్రేషన్ కోసం వేచిచూస్తున్నారు. కాగా, ఏపీ పారామెడికల్ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశామని ఏపీ వైద్యవిద్యా సంచాలకులు డా.శాంతారావు అన్నారు.
 
 

Advertisement
Advertisement