విభజనాంశాలపై పార్లమెంటును స్తంభింపజేస్తాం | Sakshi
Sakshi News home page

విభజనాంశాలపై పార్లమెంటును స్తంభింపజేస్తాం

Published Tue, Jul 21 2015 1:50 AM

విభజనాంశాలపై పార్లమెంటును స్తంభింపజేస్తాం - Sakshi

రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ కవిత
రాష్ట్రం పట్ల కొన్ని విషయాల్లో ప్రధాని తీరు సరిగా లేదు
దొంగలకే పెద్ద దొంగగా చంద్రబాబు వ్యవహారం

 
హైదరాబాద్: హైకోర్టు, ఉద్యోగుల విభజనతోపాటు తెలంగాణకు సంబంధించిన కీలకాంశాలపై పార్లమెంటును స్తంభింపజేయడం ద్వారా కేంద్రాన్ని నిలదీస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రాష్ట్రంపట్ల కొన్ని విషయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న తీరు సరిగ్గా లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వరంగ సంస్థల్లో ఆస్తులు, ఉద్యోగుల విభజన, ఎదుర్కొంటున్న సవాళ్లు-పరిష్కారాలు’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమాల అవసరం ఉండదని భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రల వల్ల వాటిని కొనసాగించాల్సి వస్తోందన్నారు. పొరుగు రాష్ట్ర పాలకులు తెలంగాణ అభివృద్ధి చెందకుండా ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగుల విభజన పూర్తికాకపోవడం, ఖాళీలను గుర్తించకపోవడం వల్ల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. పరాయి సొమ్ము తినడానికి అలవాటు పడిన చంద్రబాబు, సీమాంధ్ర అధికారులు అడ్డదారిలో ప్రభుత్వరంగ సంస్థల్లో పాగా వేసి, తెలంగాణ బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారని, దొంగలకే పెద్దగా దొంగగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని కవిత దుయ్యబట్టారు. విభజన చట్టానికి విరుద్ధంగా, అక్రమంగా సీమాంధ్ర అధికారులు ఫైళ్లు అపహరించుకుపోతున్నారని ఆరోపించారు.

భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ హైకోర్టు, ఉద్యోగుల విభ జనపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సభను స్తంభింపజేస్తామన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజనకు వేసిన షీలాభిడే, కమలనాథన్ కమిటీలు ఏడాదైనా విభజన ప్రక్రియను పూర్తిచేయట్లేదని విమర్శించారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజనపై జేఏసీలో సబ్ కమిటీ వేసి చాలా సమాచారం సేకరించామని, త్వరలో రాష్ట్రం, కేంద్రానికి అందజేస్తామన్నారు. టీజీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజనశాస్త్రీయ పద్ధతిలో జరుగలేదన్నారు. విద్యుత్తు ఉద్యోగుల విభ జన విషయంలో చేపట్టిన విధానం అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు చేయాలన్నారు. సమావేశంలో టీఎన్‌జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కన్వీనర్ థామస్‌రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాలు, జేఏసీల నేతలు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement