పవన్.. పజిల్ | Sakshi
Sakshi News home page

పవన్.. పజిల్

Published Sat, Sep 10 2016 3:32 AM

పవన్.. పజిల్ - Sakshi

- కాకినాడ ఉపన్యాసంలో కొరవడిన స్పష్టత
- హోదా ఇవ్వబోమని ప్రకటించిన విషయం తెలియనట్లు వ్యాఖ్యలు
- పాచిపోయిన లడ్డూలను తీసుకున్న చంద్రబాబుపై విమర్శల్లేవు
- పోరాడితే పోయేదేమీ లేదంటూనే బంద్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు
- ఆద్యంతం అస్పష్టత.. గందరగోళం...

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ప్రగతితో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా సాధన తప్పనిసరని ఢంకా భజాయిస్తున్న ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఏం చెప్పారనేదానిపై అభిమానుల్లో, రాజకీయ విశ్లేషకుల్లో గందరగోళం నెలకొంది. కాకినాడ సభలో ప్రత్యేక హోదాపై పోరాటంలో తమకు దిశా నిర్దేశం చేస్తారని ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు, నిర్ణయాలు తేటతెల్లమైన నేపథ్యంలో... ప్రధాన ప్రతిపక్షం వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన దశలో.. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు కూడా రోడ్డెక్కుతుండగా... సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న జనసేన అభిమానులుగా ప్రత్యేకహోదా కోసం తామేం చేయాలో వారికి పాలుపోవడం లేదు.

ప్రత్యేక హోదా ఇవ్వబోమని అరుణ్‌జైట్లీ విస్పష్టంగా ప్రకటించినా... కేంద్రం ప్రకటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా స్వాగతించినా... ఆ విషయాలు తనకు తెలియనట్లే పవన్ కళ్యాణ్ ప్రసంగించడం... ప్రత్యేక హోదా ఇస్తారా లేదా? అని కేంద్రాన్ని, పాచిపోయిన రెండు లడ్డూలను తీసుకుంటారో లేదో తేల్చుకోవాలని చంద్రబాబును ప్రశ్నించడం విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగించింది. హోదా లేదని తేల్చిపారేసి, ఏం చేస్తాం, ఎలా చేస్తామనేది వెల్లడించకపోవడాన్ని అర్థం చేసుకోకపోతే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. పోరాడితే పోయేది ఏమీలేదని ఆవేశంగా వల్లెవేసే పవన్ హోదా కోసం పోరాట పంథాను ఎంచుకోవద్దని యువతకు సూచించడంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

 అన్నీ ప్రశ్నలే... అంతా గందరగోళమే..
రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన పాపానికి ఇప్పటికే రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం... రెండేళ్ల కిందట జరిగిన విభజన గాయాలను రేపే ప్రయత్నం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి హోదా ఇచ్చేందుకు అభ్యంతరం తెలిపింది దక్షిణాది రాష్ట్రాలైనా.. ఉత్తరాది రాష్ట్రాలను ఉద్దేశించి విమర్శలు చేయడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హోదా ఇవ్వలేదని బీజేపీపై.. అందులోనూ ప్రత్యేకంగా వెంకయ్య నాయుడుపైనే విమర్శలు చేసిన జనసేనాధిపతి... ఆ పార్టీలో అత్యంత శక్తివంతమైన మిగతా ఉత్తరాది నేతలను ఎందుకు వదిలి పెట్టేశారని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్... హోదా సంజీవని కాదని, సహాయం చాలంటున్న చంద్రబాబును పల్లెత్తుమాట అనడంలేదెందుకు? నిన్న తిరుపతిలో, నేడు కాకినాడలో చంద్రబాబుపై విమర్శలే చేయలేదెందుకు? ఏపీని నాడు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే.. నేడు బీజేపీ పొట్టలో పొడిచిందని అంటున్న పవన్ వారిపై పోరాటాన్ని ఎందుకు ప్రకటించడంలేదు? టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ను రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమైతే తాను దగ్గరుండి గెలిపిస్తానని ప్రకటించిన జనసేన అధిపతి కేంద్రంలో మంత్రులుగా ఉన్న అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిల రాజీనామాలను ఎందుకు కోరడంలేదు? మంత్రులతో రాజీనామాలు చేయించి హోదా కోసం పోరాటం ఉధృతం చేయమని ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఎందుకు అడగడంలేదు? బంద్‌లు, సమ్మెలకు తాను వ్యతిరేకం కాదంటూనే, విద్యార్థులు చదువుకోవాలని, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకోవాలని సూచించడం వెనుక ఆంతర్యం ఏమిటి? వీటిలో ఏ ఒక్క ప్రశ్నకూ పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలో సమాధానాలు కనిపించడంలేదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హోదాకోసం ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారో స్పష్టతనివ్వకుండా... తెచ్చిపెట్టుకున్న ఆవేశం, రాసిపెట్టుకున్న నినాదాలతో సాధించేదేమీ లేదని వారు విమర్శిస్తున్నారు.

Advertisement
Advertisement