నాణ్యమైన విద్యతోనే ప్రజల్లో నమ్మకం! | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యతోనే ప్రజల్లో నమ్మకం!

Published Sun, Sep 6 2015 3:26 AM

నాణ్యమైన విద్యతోనే ప్రజల్లో నమ్మకం! - Sakshi

 ఉపాధ్యాయ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
 71 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
 సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించినపుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం రవీంద్రభారతిలో 71 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. వారికి శాలువా కప్పి, రూ.10వేల నగదు ప్రోత్సాహం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి, బంగారు తెలంగాణ సాధనకు టీచర్లు మార్గదర్శకులు కావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించి.. దిగజారిపోతున్న విద్యా ప్రమాణాలను పెంచాలని సూచించారు. బడుగు, బలహీనవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందిస్తేనే వారికి న్యాయం చేసిన వారు అవుతారన్నారు. అందుకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ తెస్తున్నారన్నారు. నివాస వసతితో కూడిన ఇంగ్లిష్ మీడియం విద్యను (ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు) సీబీఎస్‌ఈ సిలబస్‌తో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 రెసిడెన్షియల్ స్కూళ్ల చొప్పున 1,190 స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.

కేబీజీవీల్లో చదివే అనాథ పిల్లల బాగోగులను, పదో తరగతి తరువాత వారి ఉన్నత చదువులను ప్రభుత్వమే చూసుకునేలా కేసీఆర్ చర్యలు చేపట్టారన్నారు. అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా విధానపర నిర్ణయం తీసుకున్నారని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తామన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇంటర్మీడియెట్‌లో ఉచిత విద్యను అందించిన ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు. వచ్చే మూడు నెలల్లో యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామన్నారు. అనేకమంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారని, అయితే దాదాపు 8 వేల ఖాళీల్లో విద్యావలంటీర్లను నియమించాలని నిర్ణయించామని, ఈ నెల 21 నాటికి ప్రక్రియ చేపడుతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం (జూన్) నాటికి ఆయా ఖాళీల్లో డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లను నియమిస్తామన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రాన్ని 100 శాతం అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.
 భవిష్యత్‌కు మార్గదర్శనం...
  ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో టీచర్ల పాత్ర కీలకమైందన్నారు. ఉపాధ్యాయులు అందించిన జ్ఞానం, తెలివితేటలతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని, కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బాగా పనిచేసి ప్రభుత్వ స్కూళ్ల ఫలితాలను పెంచాలన్నారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ విద్యారంగంలో గతంలోలాగా నిర్లక్ష్యానికి తావులేకుండా కడియం శ్రీహరి చర్యలు చేపడుతున్నారన్నారు.విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం వార్షిక పురస్కార కార్యక్రమంగా కాకుండా భవిష్యత్తు మార్గదర్శనానికి నాంది కావాలన్నారు. కొత్త రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు తోడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పూల రవీందర్, సుధాకర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు వాణిప్రసాద్, శైలజారామయ్యార్, అశోక్, సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
 
 ఉత్తమ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు
 రాష్ట్రపతి చేతులమీదుగా ప్రదానం
 సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యా య అవార్డులు అందుకున్నారు. శనివారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులు అందజేశారు.


 తెలంగాణ నుంచి అవార్డులు అవార్డులు అందుకున్న వారు:
 నాగమ్మ(నారాయణ్‌పేట్, మహబూబ్‌నగర్), కె.శశికళ (చిప్పకుర్తి,కరీంనగర్), పి.రఘునారాయణ(వరంగల్), డి.వెంకటేశం(ఖమ్మం), మహమ్మద్ రాజ్ మహమ్మద్(శివునిపల్లి, వరంగల్), సి.ప్రకాశ్(నిజామాబాద్),సంపతికుమారి(కొత్తపల్లి, కరీం నగర్), హైదరాబాద్‌లోని కేంద్ర విద్యాలయ-1(ఉప్పల్)కు చెందిన కె.వి.రామలక్ష్మి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.


 ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్నవారు:
 జి.శ్రీనివాసులురెడ్డి(జాట్ల కొండూరు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా), డి.వెంకట శ్రీమన్నారాయణ(గొల్లపూడి, కృష్ణా), వై.శ్రీనివాసరావు(జాలిపూడి, ప.గోదావరి), పి.మోహనరావు(పెరికిపాలెం, ప.గోదావరి, ఆర్.శ్రీనివాసులు(తాటిగుంట్లపాలెం, చిత్తూరు), యు.ఫణీంద్రకుమార్(ఆకునూరు, కృష్ణా), ఎల్.సుబ్రమణ్యం చౌదరి(చిన్నగొట్టిగల్లు, చిత్తూరు), ఐ.సత్యనారాయణ(తుని, తూర్పు గోదావరి), పి.కృష్ణవేణి(నడుపూరు, విశాఖపట్నం).

Advertisement

తప్పక చదవండి

Advertisement