మోదీది సంకుచితం | Sakshi
Sakshi News home page

మోదీది సంకుచితం

Published Sun, Oct 4 2015 1:11 AM

మోదీది సంకుచితం - Sakshi

‘విదేశాల్లో విమర్శలు’ దిగజారుడు రాజకీయం: సోనియా ధ్వజం
గతంలో ఏ ప్రధానీ ఇలా చేయలేదు.. దేశ గౌరవం ఆయనకు పట్టదు
పేదల కోసం ఆయనకు సమయమే లేదు..
గత హామీలనే నెరవేర్చలేదు.. కొత్తగా ఇచ్చిన హామీలను అమలు చేస్తారా?
దేశం పయనం విభజనతత్వం వైపా, సామరస్యత వైపా మీరే నిర్ణయించాలి
నితీశ్ మచ్చలేని సీఎం.. మళ్లీ గెలిపించాలి: బిహార్ ప్రచారంలో పిలుపు

 
గయ/భాగల్పూర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీది సంకుచిత మనస్తత్వమని.. విదేశీ గడ్డ నుంచి తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయటం ద్వారా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. మోదీ సర్కారు తప్పుడు విధానాల వల్ల పేదల వెన్ను విరుగుతోందని విరుచుకుపడ్డారు. ఆమె శనివారం బిహార్‌లోని వజీర్‌గంజ్‌లో, భాగల్పూర్ జిల్లా కహల్‌గావ్‌లో కాంగ్రెస్ ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘ఏ ఇతర ప్రధానీ తన రాజకీయ ప్రత్యర్థులపై విదేశీ గడ్డ మీద నుంచి విమర్శించటం కానీ, బురదజల్లటం కానీ చేయలేదు. కానీ మోదీ తన సంకుచిత మనస్తత్వాన్ని, దిగజారుడు రాజకీయాలను ప్రదర్శిస్తూ ఆ పని చేశారు. బిహార్ గౌరవం గురించి కానీ, దేశ గౌరవం గురించి కానీ ఆయనకు పట్టింపులేనపుడు.. మీ గౌరవం గురించి పట్టించుకుంటారా?’ అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘మోదీ తరచుగా విదేశాలకు వెళ్లటాన్ని ఎంతో ఇష్టపడతారు.

ప్రముఖులను ఆలింగనం చేసుకోవటాన్ని ఎంతో ఇష్టపడతారు. కానీ.. పేదల కోసం ఆయనకు సమయమే లేదు. ఆయన విదేశాలకు వెళ్లొచ్చు.. కానీ ఆయనపై విశ్వాసముంచిన ప్రజలతో నటించే రాజకీయాలు చేయటం మానివేయాలి’ అని హితవు పలికారు. గత ప్రభుత్వాల పథకాలను కొత్త పేర్లతో ప్యాకేజీ చేయటంలో, పాత పథకాలను మళ్లీ ప్యాకేజీ చేసి ప్రకటించటంలో మోదీ నిపుణుడని ఎద్దేవా చేస్తూ.. తన ప్యాకేజీ ప్రకటనతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రధాని గత ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపిస్తూ.. ‘జన్‌ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచిన వారికి రూ. 5,000 చొప్పున లభించాయా? మీలో ఎంత మందికి డబ్బు వచ్చింది? ఎవరికీ రాలేదు. ఆయన హామీ ఏమైంది?’ అని నిలదీశారు. ఇంతకుముందు ఇచ్చిన హామీలను పక్కనపెట్టేసిన వారు.. ఇప్పుడు కొత్తగా ఇస్తున్న హామీలను నెరవేరుస్తారా అని ప్రశ్నించారు.

మోదీ పాలనలో పేదలకు ఒరింగిందేమీ లేదు...
‘కాంగ్రెస్ లేని బిహార్’ పేరుతో బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రస్తావిస్తూ.. ‘వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా చరిత్ర నుంచి కాంగ్రెస్‌ను, దేశ స్వాతంత్య్రం కోసం అది చేసిన త్యాగాలను చెరిపివేయలేరు’ అని ఉద్ఘాటించారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులపై మోదీ వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ‘అందరితో కలిసి.. అందరి అభివృద్ధి’ అని మాటలు చెప్తారు. కానీ.. ఈ రాష్ట్రాల్లోని ప్రజలు ఈ దేశానికి చెందిన వారు కాదా?’ అని నిలదీశారు.

 నాగ్‌పూర్-బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్...
 మోదీ 16 నెలల పాలన దేశానికి ప్రమాదకరంగా పరిణమించిందంటూ నిప్పులు చెరిగారు. రైతులు, చేనేత కార్మికులు, యువత కష్టాలను ఆమె ఉదహరించారు. పప్పు ధాన్యాల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి పెరిగిపోయాయన్నారు. అయినా ఈ ధరల పెరుగుదల వల్ల రైతుకు లాభం లేకుండా పోయిందని.. దళారీలే లాభపడుతున్నారని పేర్కొన్నారు. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను సోనియా పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘నాగ్‌పూర్ (ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయమున్న ఊరు)కు బీజేపీకి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోంద’ని ఆరోపించారు.  

 నిర్ణయించేది మీరే... ‘బిహార్ ఇప్పుడు ఒక కీలకమైన కూడలిలో ఉంది. బిహార్ భవిష్యత్తూ, దేశ భవిష్యత్తూ ఇక్కడ నిర్ణయమవుతుంది. భారతదేశం విభజనతత్వం వైపు పయనిస్తుందా లేక సామరస్యత వైపు పయనిస్తుందా అనేదానిని మీరు నిర్ణయించాల్సి ఉంటుంది’ అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారు లౌకిక శక్తులకు మద్దతిస్తారా? లేక దేశాన్ని విభజించే శక్తులకు మద్దతిస్తారా? అనేది నిర్ణయించుకోవాలన్నారు. నితీశ్‌కుమార్ మచ్చలేని ప్రతిష్ట గల సీఎం అని అభివర్ణిస్తూ.. ఆయనను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సోనియా సభల్లో మహాకూటమి మిత్రపక్షాలైన జేడీయూ నేత, సీఎం నితీశ్ కానీ, ఆర్‌జేడీ అధినేత లూప్రసాద్ కానీ పాల్గొనలేదు. వారు వేరే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారని ఆయా పార్టీలు పేర్కొన్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement