రాహుల్ గాంధీకి చేదు అనుభవం! | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీకి చేదు అనుభవం!

Published Thu, Jan 19 2017 6:29 PM

రాహుల్ గాంధీకి చేదు అనుభవం! - Sakshi

న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరువు తీసేసిననంత పనిచేశాడు ఓ చార్టెడ్ అకౌంటెంట్. తన వద్ద చొక్కా కొనుక్కోడానికి డబ్బులు లేవన్న తరహాలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రవర్తించారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. తాజాగా ఘజియాబాద్‌కు చెందిన చార్జెట్ అకౌంటెంట్ ముఖేశ్ కుమార్ మిట్టల్ వంద రూపాయల డీడీ తీసి చినిగిన కుర్తాను కుట్టించుకోవాలని రాహుల్‌కు సూచించాడు. ఆ డీడీని స్పీడ్ పోస్ట్ ద్వారా రాహుల్ పేరుతో న్యూఢిల్లీకి పంపించాడు. రాహుల్ సామాన్యుడిగా జీవనం సాగిస్తున్నారని, పాపం ఆయన వద్ద కుర్తా కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేకపోవడం తనకు ఎంతో బాధ కలిగించదని, ఆ కారణం చేతనే రాహుల్ గాంధీకి డీడీ తీసి పంపాడు. మోదీని విమర్శించినందకు ఉద్దేశపూర్వకంగానే చార్టెడ్ అకౌంటెంట్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
(చదవండి: 'మమ్మల్ని వెధవల్ని చేసే ఆటలు వద్దు')

మరోవైపు రాహుల్ కొత్త కుర్తా కొనుక్కోలేరు గానీ, విదేశీ ప్రయాణాలకు ఖర్చును మాత్రం సంతోషంగా భరించగలరని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. తలా ఓ రూపాయి వేసుకుని రాహుల్‌కు కొత్త కుర్తా కొనిచ్చేందుకు డబ్బు కలెక్ట్ చేద్దామంటూ కొందరు నెటిజన్లు పిలుపునిచ్చారు. ఇటీవల ఉత్తరాఖండ్ రిషికేష్‌లో ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరుగుతూ తన చిరిగిన కుర్తా(చొక్కా)ను చూపించిన విషయం తెలిసిందే. పెద్దనోట్ల రద్దుపై మోదీని దుయ్యబడుతూ ప్రసంగించిన రాహుల్.. అకస్మాత్తుగా మైక్‌ నుంచి కొంచెం పక్కకు జరగి చినిగిన తన కుర్తా (చొక్కా)ను అందరికీ చూపించారు. 'నా కుర్తా చినిగిపోయింది. కానీ ప్రధాని మోదీగారి కుర్తా ఎప్పుడూ చినిగినట్లు మనం గుర్తించలేదు. ఎందుకంటే ఆయన కేవలం ధనవంతులతోనే కనిపిస్తారు. అందుకే మోదీజీ ఫొటోలన్నీ సంపన్నులతో దిగినవే ఉంటాయి' అని రాహుల్ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.

Advertisement
Advertisement