మరిన్ని సంస్కరణలే లక్ష్యం | Sakshi
Sakshi News home page

మరిన్ని సంస్కరణలే లక్ష్యం

Published Sat, Jan 4 2014 12:50 AM

మరిన్ని సంస్కరణలే లక్ష్యం - Sakshi

  • విలేకరుల సమావేశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు
  •  దేశాన్ని అధిక వృద్ధిబాటలోకి తెచ్చింది ముమ్మాటికీ మా సర్కారే
  •  ధరల పెరుగుదలకు గ్లోబల్ కమోడిటీ, ఇంధన ధరల సెగే కారణం...
  •  ఎఫ్‌డీఐలకు మరింత మెరుగైన పరిస్థితులు కల్పిస్తాం...
  •  తయారీ రంగంలో ఉపాధి పెంచేందుకు కృషి...
  •  న్యూఢిల్లీ: దేశాన్ని అధిక వృద్ధిబాటలోకి తీసుకొచ్చిన ఘనత కచ్చితంగా తమ యూపీఏ ప్రభుత్వానిదేనని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. రానున్న కొద్ది నెలల్లో మరిన్ని సంస్కరణలను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ప్రధానిగా మూడోసారి శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ధరల పెరుగుదలకు ప్రపంచ కమోడిటీ, ఇంధన రేట్ల సెగే ప్రధాన కారణమని చెప్పారు. ఉల్లి ధర ఘాటు దేశ ప్రజలను అల్లాడించిన సంగతి తెలిసిందే. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలను చేజార్చుకోవడంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొనడంపై ప్రధాని ఈ విధంగా స్పందించారు.
     
     కాగా, తమ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుందని... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు సానుకూల పరిస్థితులను కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. తయారీ రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే తమ ధ్యేయమన్నారు. ‘అధికారంలో ఉన్నన్నాళ్లూ వృద్ధిని తిరిగి గాడిలో పెట్టడమే లక్ష్యంగా మా విధానాలను అంకితభావంతో అమలు చేస్తాం. ఉద్యోగ కల్పన, పెట్టుబడులకు ప్రోత్సాహం, పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం’ అని ప్రధాని స్పష్టం చేశారు. గతేడాది మల్టీబ్రాండ్ రిటైల్ సహా అనేక రంగాల్లోకి ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ కేంద్రం సంస్కరణల విషయంలో దూకుడు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇంకా పలు అంశాలపై ఆయన ఏమన్నారంటే...
     
     గ్రామీణ వేతనాలు పెరిగాయ్...
     గత కొన్నేళ్లుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ తలసరి వినియోగం భారీగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాలోల వేతనాలు మునుపెన్నడూ లేనంత వేగంగా వృద్ధి చెందడమే దీనికి కారణం. జనాభాలో మూడింట రెండొంతుల మందికి సబ్సిడీ ఆహార ధాన్యాలను అందించేందుకు ఉద్దేశించిన ఆహార భద్రత చట్టంతో.. ధరల పెరుగుదల భారం నుంచి సామాన్యుడికి కొంత ఊరట లభిస్తుంది. ఉద్యోగాల కల్పన విషయంలో మా ప్రభుత్వం కొంత వెనుకబడిన మాట వాస్తవమే. అయితే, ఈ పరిస్థితిని మార్చేందుకు మేం కఠోరంగా శ్రమిస్తున్నాం. తయారీ రంగంలో ఉపాధిని పెంచడమే దీనంతటికీ పరిష్కార మార్గం. లేదంటే ఉద్యోగాల సృష్టిలో విజయవంతం కావడం కష్టం. అందుకే భవిష్యత్తులో తయారీ రంగ వృద్ధే లక్ష్యంగా మా వ్యూహాలు కొనసాగనున్నాయి.
     
     మళ్లీ వృద్ధి పరుగులు పెడుతుంది...
     2012-13లో మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు దశాబ్దపు కనిష్టమైన 5 శాతానికి పడిపోయింది. అయితే, ఈ మందగమనానికి అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణం. రానున్న సంవత్సరాల్లో మళ్లీ మనం అధిక వృద్ధిని సాధించగలమన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. అసలు మా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే భారత్ గతంలో ఎన్నడూ చవిచూడని విధంగా చరిత్రాత్మకమైన 9 శాతం వృద్ధి రేటును సాధించింది. అయితే, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం దరిమిలా మందగమనంలోకి జారిపోవాల్సి వచ్చింది. వర్ధమాన దేశాలన్నీ ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాయి. దీనికి మనం అతీతులమేమీ కాదు. మళ్లీ మంచిరోజులు వస్తాయి. దేశీయంగా నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు మేం చేపట్టిన చర్యలతో వృద్ధి మళ్లీ పుంజుకునే సంకేతాలున్నాయి. ఇది నాకు చాలా సంతృప్తి కలిగిస్తోంది.
     
     పేదరికాన్ని తగ్గించాం...
     వృద్ధి ప్రక్రియలో సామాజిక కోణాన్ని జొప్పించడం కూడా మేం సాధించిన మరో ముఖ్యాంశం. 2004లో మేం అధికారంలోకి వచ్చిననాటి నుంచి సామాన్యులు, రైతులనుద్దేశించి అనేక పథకాలను ప్రవేశపెట్టాం. ముఖ్యంగా రైతు రుణ మాఫీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణాభివృద్ధిలో భాగంగా రోడ్లు, విద్యుదీకరణ వంటివన్నీ మా హయాంలోనే జరిగాయి. 2004-2011 మధ్య పేదరికాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. అంతక్రితం పదేళ్లలో కంటే వేగంగా పేదల సంఖ్య తగ్గింది. దారిద్య్రరేఖకు దిగువనున్న వారి సంఖ్య 13.8 కోట్ల మేర దిగొచ్చేలా మేం చేయగలిగాం.
     
     ధరలే కొంపముంచాయ్...
     ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం... పేద, సామాన్య ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మా సాయశక్తులా ప్రయత్నించాం. అయితే, ధరల పెరుగుదల ఇంకా సమస్యాత్మకంగానే ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతకు ఈ అధిక ధరలే కారణమని నిజాయితీగా ఒప్పుకుంటున్నా. అంతర్జాతీయంగా అధిక కమోడిటీ, ఇంధన ధరల కారణంగానే ధరలను నియంత్రించడంలో ఇబ్బందులు తలెత్తాయి.
     
     తయారీపై దృష్టిపెట్టాల్సిందే: కార్పొరేట్లు
     ఆహార ధరలకు కళ్లెం వేయడానికి సరఫరా అడ్డంకులను తొలగించడంతోపాటు.. తయారీ రంగం పుంజుకునేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. అదేవిధంగా చిన్న, మధ్య తరహా సంస్థ(ఎస్‌ఎంఈ)లకు ప్రోత్సాహం అందించాలని పేర్కొంది. విలేకరుల సమావేశంలో ప్రధాని వ్యాఖ్యలపై పారిశ్రామిక వర్గాలు ఈ విధంగా స్పందించాయి. ‘తయారీ రంగం ఇంకా టర్న్‌ఎరౌండ్ కావాల్సి ఉందని, అదేవిధంగా అధిక ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న ప్రధాని వ్యాఖ్యలతో మేం ఏకీభవిస్తున్నాం. ఆహార వస్తువుల సరఫరా పెంపు, మార్కెటింగ్, రవాణా సదుపాయాలను మెరుగుపరచడం ద్వారానే ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడం సాధ్యమవుతుంది’ అని  సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. అదేవిధంగా తగినంతగా ఉద్యోగకల్పన జరగలేదన్న ప్రధాని ఆందోళనలను ఉదహరిస్తూ... ఆర్థిక వృద్ధి లేకుంటే ఉద్యోగాల సృష్టి అసాధ్యమని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా పేర్కొన్నారు. తయారీ రంగం తగినన్ని ఉద్యోగాలను సృష్టించలేకపోవడానికి మందగమనంతోపాటు సరైన విధానాలు లేకపోవడమే కారణమని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement