సమస్యంతా ఆ ఒక్క దేశంతోనే! | Sakshi
Sakshi News home page

సమస్యంతా ఆ ఒక్క దేశంతోనే!

Published Wed, Sep 7 2016 2:15 AM

సమస్యంతా ఆ ఒక్క దేశంతోనే! - Sakshi

జీ-20 సదస్సులో పాక్‌పై ప్రధాని మోదీ నిప్పులు

- ఉగ్ర మద్దతుదారులపై ఆంక్షలు విధించి ఏకాకిని చేయాలని సూచన
- ఆర్థికాభివృద్ధికి అంతా ఒకటిగా ముందుకెళ్లాలని పిలుపు

హాంగ్జౌ: చైనాలో జరిగిన జీ-20 సమావేశం వేదికగా దాయాది పాకిస్తాన్‌పై ప్రధాని  నరేంద్ర మోదీ సోమవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. దక్షిణాసియాలో ఆ ఒక్క దేశమే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని పరోక్షంగా పాక్‌ను విమర్శించారు. ఇకపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, ఆర్థికంగా సహాయమందించే వారిపై ఆంక్షలు విధించి ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. ప్రపంచమంతా ఈ విషయంలో ఒకతాటిపై నిలిచి.. వీలైనంత త్వరగా దీనిపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. ‘కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం, ఆశ్రయం ఇవ్వటం దేశ పాలసీగా భావిస్తున్నాయి. భారత్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ దీన్ని సహించదు. మా దృష్టిలో ఉగ్రవాదంటే ఉగ్రవాదే’ అని మోదీ  అన్నారు. కాగా, ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక సాయంపై ప్రపంచదేశాలు అనుసరిస్తున్న వ్యూహంపై మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్) ప్రమాణాలకు అనుగుణంగా మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటిని  భారత్ అమలు చేస్తోందని.. మార్చి 2017 కల్లా ఎఫ్‌ఏటీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా అమలవ్వాలన్నారు. ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు ఆచరణయోగ్యమైన ప్రణాళికలతో ముందుకెళ్లాలని.. వీటిని తప్పనిసరిగా అమలుచేయాలని మోదీ సమావేశంలో తెలిపారు. భౌగోళిక రాజకీయ మార్పులు, పెరుగుతున్న వలసల కారణంగా.. ఉగ్రవాదం పేట్రేగి పోతోందన్నారు.

 ఆర్థిక నేరస్తులకు ఆశ్రయమా?
సమర్థవంతమైన ఆర్థిక పాలన కోసం నల్లధనం, అవినీతి, పన్నుఎగవేతలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జీ20    సమావేశంలో మోదీ సూచించారు. స్వదేశాల్లో పన్నులు ఎగ్గొట్టి.. ఎంచక్కా విదేశాల్లో గడుపుతున్న వారిని సమర్థించవద్దని.. అలాంటి వారిని బేషరతుగా దేశం నుంచి వెళ్లగొట్టాలన్నారు. ఈ దిశగా జీ-20 దేశాలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్లాలని సూచించారు. ఇలాగైతేనే స్థిర వృద్ధి సాధ్యమవుతుందన్నారు.

 ఎన్‌ఎస్‌జీ, స్కార్పిన్‌పై చర్చ
జీ-20 సమావేశం సందర్భంగా మోదీ.. టర్కీ, ఫ్రాన్స్ అధ్యక్షులు ఎర్డోగన్, ఫ్రాంకోయిస్ హోలండ్, బ్రిటన్ ప్రధాని థెరిసా మేలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఎర్డోగన్‌తో సమావేశంలో అణు సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వానికి మద్దతుపై చర్చించారు. హోలండ్‌తో సమావేశంలో ఇటీవల లీకైన స్కార్పిన్ సబ్‌మరైన్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారం లీకేజీపై మాట్లాడారు. విదేశాల్లోనే ఈ సమాచారం లీకైనట్టు స్పష్టమైందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. థెరిసా మేతో జరిగిన భేటీలో.. యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయిన తర్వాత తలెత్తుతున్న పర్యవసానాలపై చర్చించారు. వివిధ అంశాల్లో భారత్-చైనా దేశాలు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఒప్పందానికి వచ్చారు.

 కాగా.. మోదీ బుధవారం నుంచి రెండ్రోజుల పాటు లావోస్‌లో పర్యటించనున్నారు. వియంతైన్‌లో జరిగే.. భారత-ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు. మరోవైపు, పాక్‌లో మోదీ పర్యటనపై  ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. విదేశాంగ శాఖ తెలిపింది. నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ భేటీకి మోదీ వెళ్లాల్సి ఉంది.

మోదీ మాటకు జీ-20సై
మోదీ వ్యాఖ్యలపై సదస్సులో చర్చ జరిగింది. అన్ని జీ-20 దేశాల నేతలు స్పందించారు. అంతర్జాతీయ భద్రత, శాంతికి సవాలు విసురుతున్న ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని సదస్సు తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. పన్నుల ఎగవేత, సహజ వనరుల స్మగ్లింగ్, సాంస్కృతిక ఆస్తుల లూటీ, కిడ్నాపులు, బయటినుంచి వచ్చే కానుకల ద్వారా ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని మరింత పకడ్బందీగా అణచేయాలని నిర్ణయించారు.

Advertisement
Advertisement