‘నాగా’తో శాంతి ఒప్పందం | Sakshi
Sakshi News home page

‘నాగా’తో శాంతి ఒప్పందం

Published Tue, Aug 4 2015 3:11 AM

‘నాగా’తో శాంతి ఒప్పందం - Sakshi

నాగా తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న భారత ప్రభుత్వం
* ప్రధాని సమక్షంలో ఇరుపక్షాల సంతకాలు

న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో దశాబ్దాల అంతర్యుద్ధానికి అంతం పలికే దిశగా కేంద్రం చరిత్రాత్మక ముందడుగు వేసింది. తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తున్న ‘నేషనలిస్ట్, సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్- ఇసాక్, మ్యువా(ఎన్‌ఎస్‌సీఎన్- ఐఎం)’ సంస్థతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధాని  మోదీ సమక్షంలో సోమవారం ప్రభుత్వ ప్రతినిధి ఆర్‌ఎన్ రవి, ఎన్‌ఎస్‌సీఎన్- ఐఎం నేత టీ మ్యువా(79) ఆ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు.

నాగాలాండ్‌లో శాంతి నెలకొనే దిశగా వేసిన చరిత్రాత్మక అడుగుగా ఈ ఒప్పందాన్ని మోదీ అభివర్ణించారు. 16 ఏళ్లుగా దాదాపు  80 రౌండ్ల పాటు సాగిన చర్చల ఫలితంగా ఈ శాంతి ఒప్పందం రూపొందింది. అంతకుముందు 1997లో ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.  ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో నాగా ప్రజలు అధికంగా ఉన్న  ప్రాంతాలను ఏకం చేయాలన్న ఎన్‌ఎస్‌సీఎన్- ఐఎం డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందా? లేదా? అన్న విషయం  వెల్లడి కాలేదు.

ఒప్పందం వివరాలను త్వరలో విడుదల చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.  నాగా తీవ్రవాద సంస్థల్లో అతి పెద్దదైన ‘ఎన్‌ఎస్‌సీఎన్- ఐఎం’.. కేంద్రంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తుండగా, ఖప్లాంగ్ నాయకత్వంలోని ‘ఎన్‌ఎస్‌సీఎన్ - కే’ హింసామార్గంలో ఉంది. ప్రత్యేక నాగాలాండ్ కోసం సాగిన పోరాటంలో 3 వేల మందికి పైగా చనిపోయారు. మొదట స్వతంత్ర నాగాలాండ్ కావాలని డిమాండ్ చేసిన తిరుగుబాటు దారులు.. తరువాత నాగా ప్రజల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలనన్నింటినీ ఏకం చేయాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు.

ఖప్లాంగ్ సంస్థతో కూడా 2001లో భారత ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆ సంస్థ తరచుగా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ముఖ్యంగా నాగాలాండ్, మణిపూర్‌లలో దాడులు, అవినీతి, అక్రమంగా పన్నుల సేకరణ, బలవంతంగా డబ్బుల వసూళ్లకు దిగుతూ సామాన్యులను ఇక్కట్లపాలు చేస్తున్నాయి.
 
వలస పాలన అందించిన విషాద వారసత్వం.. మోదీ: శాంతి ఒప్పందంపై సంతకాల సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఒక సమస్యకు అంతం పలకడమే కాదు.. నూతన భవిష్యత్తు దిశగా ముందడుగు వేస్తున్నాం’ అన్నారు. నాగా ప్రజలనుద్దేశించి.. ‘గాయాలు మాన్పే, సమస్యలను పరిష్కరించే విషయాల్లోనే కాదు.. మీ గౌరవప్రతిష్టలను నిలుపుకునే మీ ప్రయత్నాల్లో కూడా భాగస్వాములవుతాం’ అని హామీ ఇచ్చారు.

ఆరు దశాబ్దాల ఈ సంక్షోభం వలస పాలన అందించిన వారసత్వ విషాదమని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్‌ఎస్‌సీఎన్ - ఐఎం నేతలు టీ మ్యువా, ఇసాక్ స్వులను ప్రశంసిస్తూ.. వారు చూపిన దార్శనికత, ధైర్య సాహసాల వల్లనే ఈ చరిత్రాత్మక ఒప్పందం సాధ్యమైందన్నారు. ‘నాగా ప్రజల ధైర్య సాహసాలు, పట్టుదల అనితర సాధ్యం.’ అని కొనియాడారు. భారత ప్రభుత్వం, నాగా ప్రజల సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందన్న టీ మ్యువా.. మరిన్ని సమస్యలు ముందున్నాయని హెచ్చరించారు. ఈశాన్యరాష్ట్రాల్లో శాంతి నెలకొనడం, ఆ రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయటం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు.
 
ఇతర పార్టీల నేతలతో సమాలోచనలు..
ఈ ఒప్పందంపై సంతకాలు జరిపే ముందు.. పలు పార్టీల నేతలతో మోదీ మాట్లాడారు. వారిలో మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ నేత ఖర్గే,  ములాయం, మాయావతి, శరద్ పవార్, సీతారాం యేచూరి తదితరులున్నారు.  మమత బెనర్జీ, జయలలిత, డీఎంకే నేత కరుణానిధి, జేడీఎస్ నేత దేవేగౌడ, నాగాలాండ్ గవర్నర్,  రాష్ట్ర సీఎంతోనూ మాట్లాడారు.
 
తిరుగుబాటు సంస్థలు...
నాగా నేషనల్ కౌన్సిల్: 1940-1950కాలంలో రాజకీయరంగంలో ఉంది.
 
నాగా నేషనల్ కౌన్సిల్(అడినో):
తొలి నాగా రాజకీయ సంస్థ. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఇసాక్-ముయివా): 1980 జనవరి 31న ఏర్పాటైంది.  నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్(ఖప్లాంగ్): మయన్మార్, భారత్‌లోని కొన్ని ప్రాంతాలను కలపాలటూ 1988లో ఏర్పాటైంది.
నాగా ఫెడరల్ గవర్నమెంట్: 1970లలో సాగిన వేర్పాటువాద ఉద్యమం
నాగా ఫెడరల్ ఆర్మీ: 1970లలో పనిచేసిన వేర్పాటువాద గెరిల్లా సంస్థ.

Advertisement
Advertisement