Sakshi News home page

మరిన్ని ఫలితాలు రావాలి

Published Tue, Jun 16 2015 12:41 AM

మరిన్ని ఫలితాలు రావాలి - Sakshi

గిరిజన పథకాలపై మోదీ సమీక్ష
 న్యూఢిల్లీ: గిరిజనుల సంక్షేమ పథకాల ద్వారా మరిన్ని ఫలితాలు సాధించాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం సంక్షేమ పథకాలను కేంద్రీకృతం చేయాలని సూచించారు. గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై సోమవారం ఆయన ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు పూర్తి స్థాయి లబ్ధి కలిగే విధంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, వాటి విభాగాలు కలసి పనిచేయాలన్నారు. గిరిజనుల్లో కనిపించే సికిల్ సెల్ అనీమియా వ్యాధిని అరికట్టడంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని మోదీ తెలుసుకున్నారు. అలాగే కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన జన్‌ధన్‌యోజన, సామాజిక భద్రత పథకాలు గిరిజనులపై ఎంతవరకు ప్రభావం చూపాయన్న దానిపై ఆసక్తి కనబరిచారు. దీనిపై  వివరాలు అడిగారు. గిరిజన ప్రాంతాల్లో నక్సలిజం వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని మోదీ ఇటీవలే అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు.  గిరిజనుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని నీతి ఆయోగ్‌ను కూడా కోరారు.
 
 ఆధార్ అనుసంధానంతో పెన్షన్ చిక్కులకు చెల్లు
 పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌ల జారీ, చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించేందుకు ఆధార్ ఆధారిత ఆన్‌లైన్ విధానాన్ని అవలంబించాలని మోదీ సంబంధిత అధికారులకు సూచించారు. రక్షణ రంగ రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతోద్యోగులతో ఇటీవలజరిపిన వీడియో కాన్ఫెరెన్స్ సందర్భంగా.. పెన్షనర్ల దరఖాస్తుల ఆన్‌లైన్ ట్రాకింగ్ విధానం మరింత సులభమైనది, మెరుగైనదని మోదీ అభిప్రాయపడ్డారు. పెన్షన్ జారీ, చెల్లింపుల్లో ఆన్‌లైన్ ట్రాకింగ్ విధానానికి రైల్వే శాఖ, రక్షణ శాఖ, తపాలా విభాగం, టెలికాం విభాగం అంగీకరించాయని ఆ భేటీకి సంబంధించిన మినట్స్‌లో పేర్కొన్నారు. పెన్షన్ల జారీకి సంబంధించి ధ్రువీకరణగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్(డీఎల్‌సీ)ను అన్ని బ్యాంకులు ఆమోదిస్తున్నాయని ఆ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక వ్యవహారాల విభాగం(డీఎఫ్‌ఎస్) అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement