మిమ్మల్ని ఖాళీగా ఉండనివ్వను | Sakshi
Sakshi News home page

మిమ్మల్ని ఖాళీగా ఉండనివ్వను

Published Fri, Mar 17 2017 2:29 AM

బీజేపీపీ సమావేశంలో మోదీకి తిరుపతి ప్రసాదం పెడుతున్న అమిత్‌ షా - Sakshi

బీజేపీ పార్లమెంటరీ భేటీలో మోదీ
యువత ప్రభుత్వ ప్రచారకర్తలు కావాలని పిలుపు


న్యూఢిల్లీ: ‘దేశాభివృద్ధి కోసం నేను విశ్రమించను... మిమ్మల్నెవర్నీ ఖాళీగా ఉండనివ్వను’ అని గురువారం ఇక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. తనలానే అందరూ నిరంతరం పనిచేయాలని సూచించారు. సుపరిపాలన అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు యువతరం ప్రచారకర్తలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దిశగా యువతకు చేరువయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని సభ్యులకు సూచించారు. తాజా గా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశమైంది.

యూపీ సహా పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ... అదే ఉత్సాహంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌ కుమార్‌ విలేకరులకు వెల్లడించారు. ‘వార్తా పత్రికలు, టీవీ చానళ్ల కంటే సమాచారం కోసం యువత ఎక్కువగా మొబైల్‌ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. ఈ మాధ్యమం ద్వారానే వారికి చేరువ కావాలి’ అని మోదీ పార్టీ నాయకత్వానికి సూచించారన్నారు.

దళితులకు చేరువయ్యేలా: యూపీ ఎన్నికల్లో దళితులు బీజేపీకి మద్దతిచ్చారని విశ్వసిస్తున్న బీజేపీ... వారికి మరింత చేరువయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పంచాయతీ, వార్డు స్థాయిల్లో వారోత్సవాలు జరపాలని సమావేశం నిర్ణయించింది.

2019 గెలుపే లక్ష్యం: అమిత్‌షా
మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెద్ద నోట్ల రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలే తాజా ఎన్నికలో గెలుపునకు ప్రధాన కారణమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారు. ఈ క్రమంలో 2019 లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి పెద్ద సవాలని, ఆ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులందరికీ తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

రేపు యూపీ సీఎం ఎంపిక
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రి స్థానంలో ఎవరిని కూర్చోబెడుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. యూపీతోపాటుగా ఉత్తరాఖండ్‌ సీఎం అంశంపై తేల్చేందుకు శనివారం (18 మార్చి) బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. పార్టీ పరిశీలకులు కేంద్ర మంత్రి వెంకయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ సమక్షంలో యూపీ ఎమ్మెల్యేలు బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. కాగా, యూపీ సీఎంను ఎన్నుకునే బాధ్యతను కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యకు అప్పగించినట్లుగా గురువారం అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీనిపై మౌర్యను సంప్రదించగా.. ‘నా పేరును నేనెలా ప్రతిపాదించుకుంటాను’ అని సమాధానమిచ్చారు. అనంతరం మౌర్య స్వల్ప అస్వస్థతతో ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో చేరారు. త్వరలోనే మౌర్య డిశ్చార్జ్‌ అవుతారని జేపీ నడ్డా వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement