scamకు కొత్త నిర్వచనం చెప్పిన మోదీ | Sakshi
Sakshi News home page

scamకు కొత్త నిర్వచనం చెప్పిన మోదీ

Published Sat, Feb 4 2017 3:09 PM

scamకు కొత్త నిర్వచనం చెప్పిన మోదీ - Sakshi

మీరట్: స్కాంకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని.. స్కాం (scam) అంటే సమాజ్‌వాదీ పార్టీ (s), కాంగ్రెస్ పార్టీ (c), అఖిలేష్ యాదవ్ (a)‌, మాయావతి (m) అని.. మీకు స్కాం కావాలో లేక అభివృద్ది కావాలో నిర్ణయించుకోవాలని ఉత్తరప్రదేశ్‌ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యూపీ అభివృద్ది చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగించారు.

ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబంలోని విభేదాలను డ్రామాగా అభివర్ణించారు. సమాజ్‌వాదీ పార్టీ పాలనలో యూపీ అభివృద్ధిలో వెనుకపడిందని మోదీ విమర్శించారు. ప్రజల ఆరోగ్యం, వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం 4 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే యూపీ ప్రభుత్వం కనీసం
250 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయలేదని మోదీ ఆరోపించారు. ఆ తర్వాత నిధులను 7 వేల కోట్ల రూపాయలకు పెంచామని, అయినా అఖిలేష్‌ ప్రభుత్వం 280 కోట్లకు మించి ఖర్చు చేయలేదని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం యూపీకి సాయం చేసేందుకు ప్రయత్నించినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.  

యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలను మాఫీ చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని, 2022 నాటికి ఈ కలను సాకారం చేస్తామని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నిలకు ఇటీవల బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలో రైతుల రుణాలను మాఫీ చేస్తామని చేర్చారు.

Advertisement
Advertisement