పోల'వరం' కాదని.. పట్టిసీమా..! | Sakshi
Sakshi News home page

పోల'వరం' కాదని.. పట్టిసీమా..!

Published Fri, Sep 4 2015 3:08 AM

పోల'వరం' కాదని.. పట్టిసీమా..! - Sakshi

నీరు సముద్రం పాలవుతున్నా పట్టదా..
 ♦ కాంట్రాక్టర్‌తో సీఎం లాలూచీ    
♦ నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
 
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా నదికి రప్పించి... ఆ నీటిని  రాయలసీమకు మళ్లిస్తే.. ఉభయగోదావరి జిల్లాలతోపాటు రాయలసీమకు సాగునీటి సమస్యే ఉత్పన్నమయ్యేది కాదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడి పేర్కొన్నారు. సాగు, తాగునీరందించే వరప్రదాయని పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని  మండిపడ్డారు. గురువారం శాసనసభ వాయిదా పడిన తర్వాత వైఎస్ జగన్ తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు.  శాసనసభలో టీడీపీ ప్రభుత్వం, స్పీకర్ ఒక్కటై పూర్తిగా ప్రతిపక్షం గొంతునొక్కిన దృశ్యం ఈరోజు ప్రజలందరూ చూశార ని వైఎస్ జగన్ చెప్పారు. అసలు కరువును, సాగునీటి పారుదల శాఖ నుంచి ఎలా వేరు చేస్తారని విస్మయం వ్యక్తం చేశారు. కరువుకు శాశ్వత పరిష్కారం సాగునీటి వనరుల అభివృద్ధి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని, కరువుపై చర్చ జరిగేటప్పుడు ప్రాజెక్టుల తీరుతెన్నులను ప్రస్తావించకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. కరువుపై ప్రతిపక్షం నుంచి తానొక్కడికే 25నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారని, చివరికి మీరు మాట్లాడకూడదంటూ మైక్ కట్ చేశారని తప్పుబట్టారు. తాను మాట్లాడినప్పుడు అధికార పక్షం సభ్యులు అడ్డుపడటంతోనే సరిపోయిందని అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో ఇవాళ నీటిమట్టం 798అడుగులకు పడిపోయిందని, గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో విద్యుత్ ఉత్పాదన కోసం ఎడాపెడా నీళ్లను వాడుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. దీనివల్ల 73టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమాఖ్య నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్ కూడా 73టీఎంసీల నీరు సముద్రంలో కలిసి పోయిందని బాధపడుతూ పత్రికలో వ్యాసం రాశారని అన్నారు.


 పోలవరం కట్టాలన్న ఆలోచన లేదు
 ఇన్ని నీళ్లు సముద్రంలో కలిసి పోయినా ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన చేయరని జగన్ మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ పనికిరానిదని తెలిసినా చంద్రబాబు లాలూచీ పడ్డారని దుయ్యబట్టారు. 'ఈ కాంట్రాక్టు కంపెనీ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో దినేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశం అనంతరం కేంద్రం 4 ఆగస్టు 2015వ తేదీన రాసిన లేఖలో నిర్మాణం జరుగుతున్న తీరును తీవ్రంగా విమర్శించారు. ఈఏడాది జనవరి నుంచి జూన్ వరకూ జరిగిన పోలవరం నిర్మాణం పనులు కేవలం 2శాతమేనని ఈ లేఖల్లో పేర్కొన్నారు. మట్టి పనులు మినహా ఏ పని చేపట్టలేదని తప్పు పట్టారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి నిర్మాణంపై చిత్తశుద్ధి లేదని ఈ లేఖల్లో పేర్కొన్నారు'అని వైఎస్ జగన్ చెప్పారు. ఆ లేఖలను చూపుతూ కాంట్రాక్టరుకు సంబంధించి ఇంకా అనేక విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాలున్నాయన్నారు. ట్రాన్స్‌ట్రాయ్ పనికిరాని కంపెనీ అని తెలిసినా అది టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుది కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో లాలూచీ పడ్డారని జగన్ విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంబశివరావు.. చంద్రబాబు బినామీ అని అన్నారు. పనికిరాని కంపెనీ అని తెలిసి కూడా వారికి రూ.290 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సు చెల్లించారన్నారు. అంత మొత్తం అడ్వాన్సుగా తీసుకున్న ఆ కంపెనీ చేసిన నిర్మాణపు పనులు రూ.220 కోట్ల మేరకు మాత్రమేనని చెప్పారు. ప్రాజెక్టుకు గుండెకాయలాంటి హెడ్‌వర్క్స్ పనులు ఇంతవరకూ మొదలే కాలేదన్నారు. ఏటా వరుసగా రూ.5వేల కోట్ల మేరకు పనులు చేస్తేనే మూడేళ్లలో పోలవరం పూర్తవుతుందని, మరి ఈ కాంట్రాక్టరు ఇంత దారుణంగా పనులు చేస్తుంటే ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నిద్దామంటే ఈ అంశం మాట్లాడొద్దు, కరువుకు సంబంధించింది కాదంటూ అడ్డుకున్నారని విమర్శించారు. కరువు వల్ల మా ప్రాంతంలో 1,500అడుగుల లోతుకు వెళితే గాని నీళ్లు పడటం లేదు. అందువల్ల కంప్యూటర్ బోర్లు వేయాల్సి వస్తోంది. మరి పోలవరం ఇంత నత్తనడకన సాగుతూంటే ఎన్నాళ్లు పడుతుందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై బుధవారం సభలో చంద్రబాబు రెచ్చిపోయి అబద్ధాలు, అర్ధ సత్యాలు చెప్పారని ధ్వజమెత్తారు.

పట్టిసీమపై మా వైఖరి చెప్పలేదా?
 'పట్టిసీమపై మీ వైఖరి ఏంటో చెప్పాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీలో రెండు రోజులపాటు ఇదే అంశంపై జరిగిన చర్చలో పట్టిసీమపై మా వైఖరి ఏమిటో సుదీర్ఘంగా చెప్పలేదా? ఈ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నామో స్పష్టంగా చెప్పానని' జగన్ పేర్కొన్నారు. తాను సభలో లేనిది చూసి బుధవారం ఒక్క స్వల్ప వ్యవధిని ఐదు గంటల సేపు లాగారని, కేవలం సమయం వృథా చేయడానికే అధికారపక్షం ఇలా చేసిందన్నారు. పట్టిసీమపై బాగా ఆలోచించుకుని రేపు(గురువారం) చెప్పండని చంద్రబాబు బుధవారం అసెంబ్లీలో చెప్పారని జగన్ గుర్తు చేస్తూ 'మరి ఎందుకు ఆ విషయం మేం చెప్పాలని చూస్తే వినడానికి ఎందుకంత బాధపడ్డారు' అని ప్రశ్నించారు.

 ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయి..
 'పట్టిసీమను ఎందుకు వద్దంటున్నామో మళ్లీ చెబుతాం. రాయలసీమపై మా వైఖరి అడుగుతున్నారు. దానిపైనా చెబుతాం. రాయలసీమకు నీళ్లు కావాలంటే.. ఆయన ఇచ్చిన జీవో నంబరు-1 చూడండి. జీవో నంబరు-1లో హెడ్డింగ్ కనిపిస్తుంది. జీవోలో సాగునీరు అన్న పదమే లేదు. ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్ యూజ్. రాయలసీమ అన్న పదం ఎక్కడైనా ప్రస్తావించారా? కనీసం కృష్ణా డెల్టాకైనా నీళ్లిస్తామని చెప్పారా? బోర్డులు రావా? బోర్డులు వచ్చినప్పుడు ఏం చేస్తాం? రాయలసీమ బాగుపడాలంటే స్టోరేజ్ ఉండాలి. పోలవరం కట్టాలి. పోలవరంలో నీరు వచ్చి స్టోర్ అయితే ఎవ్వరూ బాధపడరు. స్టోర్ అయిన 190 టీఎంసీలో 80 టీఎంసీలు కృష్ణాకు వస్తే కృష్ణా వాళ్లు హ్యాపి. గోదావరి డెల్టాకు ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్లు హ్యాపి. ధవళేశ్వరం కింద 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లో దాని అవసరం 18వేల క్యూసెక్కులు. రబీలో 12వేల క్యూసెక్కులు. దీనికి అదనంగా పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలున్నాయి. వాటి అవసరాలు చూసుకోవాలి. గోదావరి పొంగేది జూలై 15 నుంచి అక్టోబరు ఆఖరు వరకు. కొన్నిసార్లు నవంబరు 15వరకు. ఈ సమయంలో 80రోజులు మిగులు ఉంటుంది. ఇది ఖరీఫ్ సీజన్‌లో భాగం. కృష్ణాలో ఈ ఏడాది కరువు.. కానీ సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరులో పొంగుతుంది. 30-45రోజులు పొంగుతుంది. ఈ సంవత్సరం కరువు కాబట్టి ఈ ఏడాది సంగతి పక్కన పెడితే, స్టోరేజీ లేకుండా పట్టిసీమ శుద్ధ వేస్ట్. స్టోరేజీ ఉంటే ఓకే. ఆ స్టోరేజీయే పోలవరం. అందుకే పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం. మరో కారణమేమంటే.. చంద్రబాబు కాంట్రాక్టరుతో కుమ్మక్కై పోలవరాన్ని గాలికొదిలేశారు. పనిచేయలేరని తెలిసినా.. ఆ కాంట్రాక్టరునే కొనసాగిస్తారు. పనిచేయలేదని తెలిసి మొబిలైజేషన్ అడ్వాన్స్ రూ.290 కోట్లిచ్చారు. పోలవరం పూర్తి చేయాలని టెండర్లు రద్దు చేసి కేంద్రానికి ఎందుకు అప్పగించరు? ఆ కాంట్రాక్టరుతోనే వేరే వాళ్లకి సబ్ కాంట్రాక్టులు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కాంట్రాక్టులోనే జీవో 22ను వాడుకుని ఇంకా రేట్లు ఎక్కువ అడగమంటారు. వాస్తవమేమంటే.. స్టీల్ రేట్లు తగ్గాయి. అల్యూమినియం రేట్లు తగ్గాయి. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతోంది. రూ.1,100 కోట్ల పట్టిసీమ ప్రాజెక్టుకు 21.9 శాతం ఎక్సెస్(అదనం)కు ఇచ్చారు కాబట్టి రూ.1,350కోట్లు అయింది. 30 పంపులు, 15 పైపులైన్లు వేయాల్సి ఉండగా ఇప్పుడు డిజైన్‌ను మార్చారు. 30 పంపులను 24 చేశారు. 15 పైపులైన్లను 12కు తగ్గించారు. పైపుల వ్యాసాన్ని 3మీటర్ల నుంచి 3.2మీటర్లకు పెంచారు.

పంపుల సామర్థ్యాన్ని కాస్త సవరించామంటున్నారు. మీరంతా చదువుకున్న వారు, తెలివైన వాళ్లు. 30 పంపులను 24కు తగ్గించారంటే సైజు తగ్గదా? అలాంటప్పుడు సహజంగా డబ్బు పొదుపు అవుతుంది. డిజైన్ మార్చారు కాబట్టి రూ.250 కోట్లు తగ్గాల్సింది పోయి రూ.250 కోట్లు పెరిగింది. గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులోని 7ఇ, 7 ఎఫ్ ప్రకారం పట్టిసీమ నిర్మాణం వివాదాస్పదమవుతుందనే వ్యతిరేకిస్తున్నాం. ఇదేదో తానే ఇతర రాష్ట్రాలకు సలహా ఇస్తున్నానని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. నివేదికలో ఉండే అంశాలను వాళ్లు చూడరా.. గోదావరి ట్రిబ్యునల్‌లోని పోలవరం ప్రాజెక్టు పేరిట రెండో చాప్టర్‌లో 7(ఇ) క్లాజ్‌లో.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం  అనుమతి వచ్చిన వెంటనే, కుడి కాల్వకు వాస్తవంగా నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే విషయంతో సంబంధం లేకుండా , కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ కర్ణాటక, మహారాష్ట్ర కు ఉంటుంది’ అని ఉంది. 7(ఎఫ్)లో.. '80 టీఎంసీల కంటే ఎక్కువ కుడికాల్వకు మళ్లిస్తే.. ఆనీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి'అని ఉంది. కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలకూ వాటా ఇవ్వాల్సిన పరిస్థితిని పట్టిసీమ పథకం కల్పిస్తుంది. గోదావరి, కృష్ణా జలాలపై బోర్డులు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. వాటికి అధికారాలు అప్పగించడం అనివార్యంగా జరిగేదే. వాటిలోనైనా ఈ అంశాలు ప్రస్తావనకు వస్తాయి. పట్టిసీమకు పెట్టే డబ్బులను పులిచింతల, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులపై పెడితే అవి పూర్తవుతాయి. రాయలసీమ మీద ప్రేమంటారు. అంత ప్రేమ ఉంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని విద్యుత్తు ఉత్పత్తి కోసం అడ్డగోలుగా ఎందుకు తోడేస్తారు? రాయలసీమకు నీళ్లివ్వాలంటే పోతిరెడ్డిపాడే మార్గం. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోగలం. నీటిమట్టాన్ని 798 అడుగులకు తీసుకొచ్చారు. చంద్రబాబు రాయలసీమ గురించి మాట్లాడతారు. ప్రాజెక్టుల దగ్గరే మంచం వేసుకుని పడుకుంటానంటారు. సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు చేసిన కేటాయింపులు చూస్తే ఎప్పటికి పూర్తవుతాయో.. అంతుబట్టడం లేదని ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. 2015-16 బడ్జెట్‌లో హంద్రీనీవాకు రూ.212 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో మోటార్ల కరెంటు బిల్లుల ఖర్చే రూ.200 కోట్లున్నాయి. ఈ నిధులన్నీ కరెంట్ బిల్లులకే సరిపోతాయి. గాలేరు-నగరికి రూ.169కోట్లు, వెలుగొండకు రూ.153కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల ప్రకారం ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయి?'అని జగన్ ప్రశ్నించారు.

 పోలవరంపై బాబు పూటకో మాట
 'పోలవరంపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారి రెండేళ్లు అన్నారు.. మూడేళ్లు.. ఇప్పుడు నాలుగేళ్లు.. అంటున్నారు. సంవత్సర సంవత్సరం పెంచుతున్నారు. అసెంబ్లీలో 2018కి పూర్తవుతుందన్నారు. 2018కి పూర్తి చే యాలంటేఏడాదికి కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టును పరుగెత్తించాలి. మా ఖర్మ ఏందంటే.. ఆయన అబద్ధాలు ఎన్నైనా చెబుతాడు. ఏమైనా మోసం చేయగలుగుతాడు' అని జగన్ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా గురించి తాను 15 నెలల తర్వాత మాట్లాడాను, దీనిపై ప్రధానమంత్రిని కలవలేదని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై జగన్ స్పందిస్తూ.. ప్రధానిని రెండు, మూడుసార్లు కలిశా.. ఒక్కో కేంద్ర మంత్రిని నాలుగైదుసార్లు కలిసుంటానని స్పష్టం చేశారు.

 రెండు జీవోలెందుకిచ్చారు?
 'రైతుల ఆత్మహత్యలపై రెండు రకాల జీవోలిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.5లక్షల పరిహారమంటూ జీవో నెంబరు 62 ఇచ్చారు. మళ్లీ జూలైలో జీవో నంబరు 690 జీవో ఇచ్చారు. ఈ జీవోలో పరిహారం మాత్రం రూ.లక్షన్నరేనని పేర్కొన్నారు. నిజంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు అందరికీ రూ.5 లక్షల పరిహారం ఇస్తుంటే.. అదే కంటిన్యూ చేస్తుంటే రెండు రకాల జీవోలివ్వడం ఎందుకు? రెండు వేర్వేరు నెంబర్లతో జీవోలివ్వడంలో అర్థమేంటి? అనంతపురంలో రైతులకు డబ్బులు వచ్చాయంటే కారణం.. నేను అనంతపురం పోతున్నానని, నా బాధ తట్టుకోలేక.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గాథలు చూపిస్తారని హడావుడిగా ఈ జీవో ఇచ్చారు. లేకపోతే రైతులంతా బ్రహ్మాండంగా ఉన్నారని ప్రొజెక్షన్ ఇచ్చేవాళ్లు. అనంతపురం రైతులకు కాస్తో, కూస్తో చెక్కులు అందాయంటే.. ఈ క్రెడిట్ మీడియాదే. మిగిలిన జిల్లాల్లో రైతు ఆత్మహత్యలపై నేను పర్యటిస్తే ఎన్ని జీవోలిస్తారో.. కర్నూలు జిల్లాకు ఇంకా పోలేదు. అక్కడకు వెళుతున్నానంటే మరో జీవో ఇస్తారేమో. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇస్తే మంచిది. కానీ నేను వెళ్లినప్పుడు బాధిత కుటుంబాలు రూ.లక్షన్నరే ఇస్తున్నారని నాతో చెప్పారు. పరిహారానికి సంబంధించి జీవో మార్పు చేశారని చెబుతున్నారు. జీవో మార్చకపోతే మరీ మంచిది. ఈ విషయాన్ని అసెంబ్లీలో సూటిగా అడిగా. జీవోలు మార్చలేదని సత్యదూరమైన మాటలు చెప్పి చివరకు కనీసం నాకు మైక్ ఇవ్వలేదు.

మైక్ ఇస్తే జీవోలు మార్చిన విషయం బయటకు వస్తుందనుకున్నారు. జీవో నంబరు 690లో రూ.లక్షన్నర పోనూ మిగిలిన రూ.3.50లక్షలు ఇస్తామని ఎక్కడైనా రాశారా? జీవోలు పేర్కొన్న పేర్ల ప్రకారం వారి ఇళ్లకు వెళ్లి వారిని డబ్బులొచ్చాయా? అని అడగండి. నేను మాట్లాడిదంతా కరువు గురించి చర్చ కాదట. నేను మాట్లాడిన విషయాల్లో వ్యక్తిగతంగా ఎవ్వరినైనా విమర్శించానా? సబ్జెక్ట్‌లో రవ్వంతైనా తిట్టానా? ఇన్‌పుట్ సబ్సిడీ గురించి.. ఆత్మహత్యలు.. రుణాలు.. గురించి మాట్లాడాను. చివరకు 1,500అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఏంటని ప్రశ్నించా? పరిష్కారంలో జాప్యాల గురించి చెప్పా. ఇది సబ్జెక్ట్ కాదా? ప్రతిపక్ష నాయకునికే ఈ పరిస్థితి. ప్రతిపక్షం నుంచి ఏకైక సభ్యుడు కరువు గురించి మాట్లాడుతుంటే సభలో ఇదీ పరిస్థితి' అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement