నాటకీయంగా సురేశ్‌ను వదిలిన పోలీసులు | Sakshi
Sakshi News home page

నాటకీయంగా సురేశ్‌ను వదిలిన పోలీసులు

Published Thu, Nov 5 2015 9:30 AM

Police Released Suresh

వారం రోజులుగా పోలీసుల అదుపులో ఉన్న నూతక్కి సురేశ్‌ను బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య వదిలేశారు. పోలీసులు సురేశ్‌ను అదుపులోకి తీసుకుని వదలడం లేదంటూ కుటుంబసభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం తెలిసిందే.


ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచి సురేశ్ కుటుంబసభ్యులకు ఫోన్లు చేసి అతడిని తీసుకెళ్లాలంటూ హడావుడి చేసినట్లు చెబుతున్నారు. ఎస్.ఐ. రవిబాబు బుధవారం సురేశ్‌ను తెలుగుదేశం పార్టీకి చెందిన తుళ్ళూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్ర వద్ద విడిచి వెళ్లారు. సురేశ్‌ను జెడ్పీటీసీ సభ్యుడి వద్ద ఎలా వదిలి వెళతారంటూ కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.


సురేశ్‌ను వారం రోజులుగా చిత్రహింసలకు గురిచేసి పంట దహనానికి పాల్పడింది తానేనని, తన మేనమామ చంద్రశేఖర్ చేయించాడని పేపర్లపై రాయించుకుని సంతకాలు చేయించారని కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రస్థాయిలో భయపెట్టి సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారని, ఈ కేసులో అన్యాయంగా ఇరికిచేందుకు పోలీసులు కుట్రపన్నడం దారుణమని వాపోతున్నారు.
 
 జగన్ వచ్చిపరామర్శించడంజీర్ణించుకోలేకే కుట్ర
 రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్‌కు పొలం ఇవ్వలేదనే కోపంతో గుర్తుతెలియని వ్యక్తులు మల్కాపురంలోని నా  చెరకు పంటను దహనం చేశారు. స్పందించిన ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పంట పొలానికి వచ్చి నన్ను పరామర్శించి ప్రభుత్వ తీరును తప్పు పట్టడాన్ని జీర్ణించుకోలేక పోలీసులను అడ్డుపెట్టి నన్ను, నా మేనల్లుడిని కేసు లో ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు.


29వ తేదీ న విచారణ పేరుతో నామేనల్లుడు సురేశ్‌ను తీసుకెళ్లి డీఎస్పీ విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. తానే ఈ పంట దగ్ధానికి పాల్పడినట్లుగా సురేశ్‌చేత రాయించుకుని సంతకాలు చేయించి సెల్‌లో వీడియో రికార్డు కూడా చేశారు. రాజధాని ప్రాంతం లో 13 చోట్ల పంట పొలాల్లో వెదురు బొంగులు దగ్ధమైన సంఘటనలకు సంబంధించి కేసులను సైతం సురేశ్‌పై మోపేందుకు ప్రయత్నిస్తున్నారు.
 - గద్దే చినచంద్రశేఖర్



 

Advertisement
Advertisement