రాష్ట్రపతిగా ప్రణబ్‌ చివరి సందేశం.. | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిగా ప్రణబ్‌ చివరి సందేశం..

Published Mon, Jul 24 2017 8:49 PM

రాష్ట్రపతిగా ప్రణబ్‌ చివరి సందేశం.. - Sakshi

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామంలో విద్యాభ్యాసం మొదలుపెట్టి.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అత్యున్నత శిఖరంగా భావించే రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన ప్రణబ్‌ ముఖర్జీ రాజకీయ ప్రస్థానం ముగిసింది. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా ప్రణబ్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు.

పార్లమెంటు తనకు దేవాలయం వంటిదని, ఎప్పటికీ దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కోవింద్‌ భవిష్యత్తులో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని తాను ఐదేళ్ల క్రితమే ప్రమాణం చేశాననీ, దేశానికి తాను చేసిన దానికంటే తనకు దేశమే ఎక్కువ ఇచ్చిందన్నారు. భారత్‌ అంటే భూభాగం మాత్రమే కాదని, భిన్న జాతులు, భిన్న అభిప్రాయాల కలయిక అని అభివర్ణించారు. ప్రభుత్వాలు పేదల ప్రజల సంక్షేమంపై దృష్టిసారించాలని సూచించారు. ప్రజలంతా సహనంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లపాటు రాజ్యాంగమే తనను నడిపించిందని ఈ సందర్భంగా ప్రణబ్‌ గుర్తుచేసుకున్నారు.

తనపై నమ్మకం ఉంచిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ శతాబ్దంలో భిన్నత్వంలో కొనసాగుతున్న జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు, శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థల ప్రగతిపై చర్చ జరగాలన్నారు. సంక్షోభంలో ఉన్న సేద్యాన్ని లాభసాటిగా మార్చాలని, పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా కొత్త సేద్యాన్ని ఆవిష్కరించాలని సూచించారు. 50 ఏళ్ల ప్రజా జీవితంలో రాజ్యాంగమే తనకు పవిత్రగ్రంథంగా నిలిచిందన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని ప్రణబ్‌ ఆకాంక్షించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement