కోవింద్‌ గెలుపు కోసం.. | Sakshi
Sakshi News home page

కోవింద్‌ గెలుపు కోసం..

Published Wed, Jun 21 2017 2:54 AM

కోవింద్‌ గెలుపు కోసం.. - Sakshi

పెద్ద ఎత్తున సంప్రదింపులు ప్రారంభించిన బీజేపీ
జూన్‌ 23న నామినేషన్‌కు భారీగా సన్నాహాలు
కోవింద్‌కు మద్దతు ప్రకటించిన శివసేన


న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపు కోసం పార్టీలతో సంప్రదింపుల్ని బీజేపీ ముమ్మరం చేసింది. అందులో భాగంగా మంగళవారం పీడీపీ, డీఎంకే, పీఎంకే, జేడీ(ఎస్‌), ఐఎన్‌ఎల్డీల మద్దతు కోరింది. జమ్మూ కశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ, జేడీ(ఎస్‌) నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే నేత స్టాలిన్, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్‌లకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఫోన్లు చేసి కోవింద్‌కు మద్దతివ్వాలని అభ్యర్థించారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిచ్చేందుకు ముఫ్తీ హామీనిచ్చినట్లు సమాచారం.

 ఇక ఐఎన్‌ఎల్డీ చీఫ్‌ ఓం ప్రకాశ్‌ చౌతాలాను వెంకయ్య వ్యక్తిగతంగా కలసి మద్దతు కోరారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుపై సస్పెన్స్‌కు తెరదించుతూ.. కోవింద్‌కు మద్దతిస్తామని శివసేన ప్రకటించింది. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే  తెలిపారు.   

ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
మరోవైపు జూన్‌ 23న కోవింద్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు అందాయి. అలాగే తమిళనాడు సీఎం పళనిస్వామి, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు వెంకయ్య నాయుడు ఫోన్‌ చేసి ప్రత్యేకంగా ఆహ్వానించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నామినేషన్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, అందరు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ సీఎంలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు.  

గవర్నర్‌ పదవికి రాజీనామా
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన రామనాథ్‌ కోవింద్‌.. మంగళవారం బిహార్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు వీలుగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. కోవింద్‌ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠీకి అదనంగా బిహార్‌ బాధ్యతల్ని అప్పగించారు.

జడ్జీల్ని విమర్శించే హక్కు ఉండాలి
న్యాయమూర్తుల్ని నియమించే రాష్ట్రపతిని విమర్శించే హక్కు ఉన్నప్పుడు.. జడ్జీల్ని ఎందుకు విమర్శించకూడదని కోవింద్‌ ఒక సందర్భంలో ప్రశ్నించారు. కోర్టు ధిక్కార(సవరణ)బిల్లుపై మార్చి 3, 2006న రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రపతి విడిదికి అనుమతి నిరాకరణ
రామ్‌నాథ్‌ కోవింద్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. బిహార్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో సిమ్లాలోని రాష్ట్రపతి విడిది కేంద్రం సందర్శనకు వెళ్లగా.. లోపలికి వెళ్లేందుకు ఆయనకు అనుమతి నిరాకరించారు. ఈ ఏడాది మే 28న కోవింద్, ఆయన కుటుంబసభ్యులు సిమ్లా పర్యటనకు వెళ్లారు. నిరాడంబరుడిగా పేరున్న ఆయన కుటుంబసభ్యులతో కలిసి ప్రైవేట్‌ ట్యాక్సీల్లోనే పర్యటించారు. సిమ్లాలోని కొండలపై ఉన్న రాష్ట్రపతి విడిది కేంద్రానికి వెళ్లగా అనుమతి లేకపోవడంతో వెనుదిరిగారు.

Advertisement
Advertisement