రాజధాని సర్వనాశనం.. | Sakshi
Sakshi News home page

రాజధాని సర్వనాశనం..

Published Fri, Jun 30 2017 10:18 PM

రాజధాని సర్వనాశనం..

- రామ్‌నాథ్‌, మీరాల ఓటమి ఖాయం
- గెలిచేది ఈ దేవుడే.. లేదంటే ఢిల్లీలో ప్రళయం
- రాష్ట్రపతి ఎన్నికల్లో హరియాణా జోతిష్యుడి కలకలం
- రిటర్నింగ్‌ అధికారుల విస్మయం.. నామినేషన్‌ తిరస్కృతి


న్యూఢిల్లీ:
తనను తాను దేవుడిగా అభివర్ణించుకున్న ఓ జోతిష్యుడు రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో సంచలనంగా మారాడు. ఎన్డీఏ, విపక్షాల అభ్యర్థులుగా బరిలో ఉన్న రామ్‌నాథ్‌ కోవింద్‌, మీరాకుమార్‌లలో ఏఒక్కరూ రాష్ట్రపతి కాలేరని, ఆ పదవికి అన్నివిధాలా అర్హుణ్ని తానేనంటూ నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్నాడు.

హరియాణలోని పానిపట్‌కు చెందిన జోతిష్యుడు దేవిదయాళ్‌ అగర్వాల్‌ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశాడు. సంబంధిత పత్రాల్లో తనను తాను దేవుడిగా, సర్వశక్తిమంతుడిగా కీర్తించుకున్నాడు. అంతటితో ఆగకుండా.. ‘నాకు ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు అవసరం లేదు. ఎందుకంటే గెలిచేది నేనే. రామ్‌నాథ్‌ కోవింద్‌, మీరాకుమార్‌ల దగ్గర మంత్రదండాలేమీ లేవు కాబట్టి వాళ్ల ఓటమి ఖాయం. నన్ను రాష్ట్రపతిని చేయాలన్న అభ్యర్థనను కాదంటే.. ఢిల్లీ సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త!’  అని రాసుకొచ్చాడు.

ఇదంతా చదివి గొల్లుననవ్విన రిటర్నింగ్‌ అధికారులు.. చివరికి ‘దేవుడి’ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం(జులై1)తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దాఖలైన అన్ని(మొత్తం 95) నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. వీటిలో రామ్‌నాథ్‌, మీరాకుమార్‌లు తప్ప మిగిలిన 93 మంతి నామినేషన్లు తిరస్కరణకు గురికావడం గమనార్హం.

భగత్‌సింగ్‌, ఐన్‌స్టీన్‌ల సాక్షిగా..
రాష్ట్రపతి పదవికి నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో ‘దేవుడు’ దేవీదయాళ్‌ ఒక్కడే కాదు.. చాలా మంది చాలారకాల విచిత్రాలు ప్రదర్శించారు. హరియాణాకే చెందిన వినోద్‌కుమార్‌ అనే వ్యక్తి తన నామినేషన్‌ పత్రాల్లో ‘మద్దతు ఇస్తోన్నవారి పేర్ల’ జాబితాలో భగత్‌ సింగ్‌, ఐన్‌స్టీన్‌, జాన్‌ఎఫ్‌ కెన్నడీ, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, అబ్రహాం లింకన్‌, నిల్సన్‌ మండేలా, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తదితర యోధుల పేర్లను రాశాడు. మరికొందరైతే బాలీవుడ్‌ స్టార్లు, బిజెనెస్‌ లీడర్లు తమకు మద్దతు ఇస్తున్నట్లు నామినేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement