‘ఉగ్ర’ సాయంపై ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర’ సాయంపై ఉక్కుపాదం

Published Wed, May 31 2017 1:02 AM

‘ఉగ్ర’ సాయంపై ఉక్కుపాదం - Sakshi

టెర్రరిజానికి సహకరిస్తున్న వారిపై ఉమ్మడిపోరు
భారత్, జర్మనీల ప్రతిన.. ప్రపంచ దేశాలు కలిసి రావాలని పిలుపు
వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, ఇతర కీలక అంశాలపై మెర్కెల్‌తో మోదీ చర్చలు
భారత్‌లో పుంజుకున్న సంస్కరణలు.. పెట్టుబడులకు మోదీ పిలుపు
12 ఒప్పందాలు.. భారత ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి జర్మనీ మద్దతు


బెర్లిన్‌: ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని భారత్, జర్మనీ నిర్ణయించాయి. ఉగ్ర శక్తులకు ఆశ్రయమిస్తున్నవారిపై కఠిన చర్యలు అవసరమని తేల్చిచెప్పాయి. జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌తో చర్చల సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై మంగళవారం కీలక చర్చలు జరిపారు. వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, వాతావరణ మార్పులు, క్రీడారంగంలో సహకారం అందించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. నైపుణ్యాభివృద్ధిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న జర్మనీ.. భారత్‌లోని యువతకు శిక్షణ ఇవ్వాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల వాణిజ్య సదస్సులో మోదీ ప్రసంగిస్తూ.. భారత్‌లో సంస్కరణల వేగం పెరిగిందని, పెట్టుబడులకు జర్మన్‌ కంపెనీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఇరు దేశాలు ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’: మోదీ
గంటసేపు ఇరు దేశాధినేతల ప్రత్యేక భేటీ అనంతరం మెర్కెల్‌తో కలిసి మోదీ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ద్వైపాకిక్ష సంబంధాలు వేగంగా, సానుకూల మార్గంలో పురోగమిస్తున్నాయి. భారత్‌ను శక్తివంతమైన, సామర్థ్యం గల భాగస్వామిగా జర్మనీ పరిగణిస్తోంద’ని మోదీ పేర్కొన్నారు. భారత్, జర్మనీలు ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అని, ఇరు దేశాలు నైపుణ్య శిక్షణలో సహకరించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ‘నైపుణ్యాభివృద్ధిలో జర్మనీ ప్రపంచ స్థాయి ప్రమాణాల్ని అందుకుంది.

 అలాంటి నైపుణ్యం భారత్‌కు చాలా అవసరం. భారత్‌లో 35 ఏళ్లలోపు యువత దాదాపు 80 కోట్ల మంది ఉన్నారు. వారికి నైపుణ్య శిక్షణలో జర్మనీ సాయపడితే భారత్‌కు ప్రయోజనకర’మని మోదీ పేర్కొన్నారు. భారత్, జర్మనీల మధ్య ఆర్థిక సంబంధాల్లో వేగవంతమైన, ఫలితంతో కూడిన భారీ పురోగతిని ఆశిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ‘భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు జర్మన్‌ కంపెనీలకు అనుమతుల కోసం ఫాస్ట్‌ట్రాక్‌ వ్యవస్థ ఏర్పాటు చేశాం. జర్మనీకి చెందిన మధ్యస్థాయి కంపెనీలు ముందుకొచ్చాయ’ని తెలిపారు.

సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలి..
భవిష్యత్తు తరాలు ఎదుర్కొంటోన్న అతి పెద్ద సమస్య ఉగ్రవాదమేనని, మానవతా శక్తులు ఈ ఉగ్రభూతంపై పోరుకు కలిసికట్టుగా ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేయాలి, ఈ సహకారంలో సైబర్‌ భద్రతతో పాటు నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం చాలా కీలకం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, స్వీడన్‌ల్లో వరుసగా ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మెర్కెల్‌ నాయకత్వం అమోఘం
ఈ సందర్భంగా యూరోపియన్‌ యూనియన్‌ ఐక్యతకు మోదీ పిలుపునిచ్చారు. జర్మనీ తరఫున సంప్రదింపులు జరిపేందుకు భారత్‌ సిద్ధమని ప్రధాని చెప్పారు. మెర్కెల్‌ బలమైన నాయకత్వాన్ని మోదీ ప్రశంసిస్తూ.. బ్రెగ్జిట్‌ అనంతరం యూరప్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించేందుకు మెర్కెల్‌ గొప్పగా కృషిచేస్తున్నారన్నారు. ప్రస్తుతం యూరప్, ప్రపంచ దేశాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని.. ఇలాంటి సమయంలో మెర్కెల్‌ వంటి బలమైన నేత అవసరాన్ని భారత్‌ గుర్తించిదన్నారు.

భారత్‌ ఎన్‌ఎస్జీ సభ్యత్వానికి జర్మనీ మద్దతు
చర్చల్లో అణు సరఫరాదారుల కూటమి(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వానికి జర్మనీ మద్దతు పలికింది. అత్యవసరంగా ఐరాస భద్రతామండలిలో భారీ స్థాయిలో సంస్కరణలు అవసరమని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య పెరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి.   

సైబర్, రైల్వే రంగాల్లో ఒప్పందాలు..
చర్చల తర్వాత దేశాల మధ్య 12 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సైబర్‌ పాలసీ, అభివృద్ధి పథకాలు, సుస్థిర పట్టణాభివృద్ధి, క్లస్టర్‌ మేనేజర్స్‌ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, రైల్వే భద్రత, ఒకేషనల్‌ శిక్షణ ప్రోత్సహం వంటి రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నాయి.

సైబర్‌ పాలసీపై ఉమ్మడి డిక్లరేషన్‌
మోదీ, మెర్కెల్‌ల మధ్య 4వ భారత–జర్మనీ ఇంటర్‌ గవర్నమెంటల్‌ సంప్రదింపుల (ఐజీసీ) అనంతరం ఇరు దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ‘ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద, తీవ్రవాద ముప్పు పెరగడంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు.. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని ఖండించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపైతోపాటు ఆశ్రయమిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాల్సి అవసరముందన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరుకు సమగ్ర విధానాన్ని ఖరారు చేయాలి’ అని ప్రకటనలో పేర్కొన్నారు.. ఈ సందర్భంగా సైబర్‌ పాలసీపై జర్మనీ, భారత్‌ల మధ్య సహకారానికి ఉమ్మడి డిక్లరేషన్‌ను రూపొందించారు.

పర్యావరణ కలుషితం అనైతికం.. భవిష్యత్తు తరాలకు చెందాల్సిన పర్యావరణాన్ని కలుషితం చేయడం అనైతికం, నేరపూరితమని  మోదీ తప్పుపట్టారు. ప్రకృతిని పరిరక్షించాల్సిన అవసరముందన్న ప్రధాని.., ప్రకృతి పరిరక్షణలో భారతదేశం తరతరాలుగా అనుసరిస్తున్న విలువల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2022 నాటికి పునరుత్పాదక వనరుల నుంచి 175 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు. భారత ఇంధన రంగంలో మరింత పురోగతి కోసం ఇండో–జర్మన్‌ ఎనర్జీ ఫోరం తోడ్పాటును , పర్యావరణ అంశాల్లో ఎన్విరాన్‌మెంట్‌ ఫోరం ప్రాధాన్యాన్ని భేటీలో మోదీ, మెర్కెల్‌లు ప్రశంసించారు. అలాగే ఇండో జర్మన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఫోరం సమావేశం– 2017ను న్యూఢిల్లీలో నిర్వహించాలని నిర్ణయించారు.

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి
భారత్‌లో ఆశించదగ్గ స్థాయిలో సంస్కరణలు జరిగాయని భారత్‌–జర్మనీ వాణిజ్య సదస్సులో మోదీ అన్నారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారం పెరగాల్సి ఉందన్నారు. గత మూడేళ్లుగా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించిందని, భారత్‌లో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెంచాలని కోరారు. జర్మనీలో పలు కార్యక్రమాలతో బిజిబిజీగా గడిపిన మోదీ ఆ దేశాధ్యక్షుడితో భేటీ అనంతరం స్పెయిన్‌కు వెళ్లారు.

భారత్‌ విశ్వసనీయ భాగస్వామి: మెర్కెల్‌
మెర్కెల్‌ మాట్లాడుతూ.. జర్మనీకి భారత్‌ విశ్వసనీయ భాగస్వామని, ఇరు దేశాలు విస్తృత సహకారాన్ని సాధించాయని అన్నారు. అభివృద్ధిలో సహకరించుకునేందుకు దాదాపు బిలియన్‌ యూరోల(రూ. 7,200 కోట్ల) విలువైన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయని చెప్పారు. ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యమైన పర్యావరణ పరిరక్షణతో పాటు భారతదేశ ఇంధన అవసరాల్ని తీర్చేందుకు అవసరమైన మార్గాల కోసం సహకారాన్ని కొనసాగించాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. అలాగే స్థిరమైన అభివృద్ధి కోసం ఇతర రంగాల్లో సహకారం కొనసాగించాలని నిర్ణయించాయి.  

మోదీతో ప్రియాంక  భేటీ
జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా కలిశారు. ప్రియాంక ట్వీట్‌ చేస్తూ.. ‘నన్ను కలిసేందుకు సమయం కేటాయించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. హాలీవుడ్‌ చిత్రం ‘బే వాచ్‌’లో నటించిన ప్రియాంక ఆ సినిమా ప్రచారం కోసం జర్మనీలో పర్యటిస్తున్నారు.

Advertisement
Advertisement