రేస్‌క్లబ్ సర్కారు నియంత్రణలోకి! | Sakshi
Sakshi News home page

రేస్‌క్లబ్ సర్కారు నియంత్రణలోకి!

Published Fri, Dec 4 2015 2:22 AM

రేస్‌క్లబ్ సర్కారు నియంత్రణలోకి!

సాక్షి,  హైదరాబాద్: కొందరు వ్యక్తుల ప్రైవేటు సామ్రాజ్యంగా మారిన హైదరాబాద్ రేస్ క్లబ్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బుకీల సహకారంతో ఏటా రూ. వందల కోట్ల వ్యాపారం చేస్తూ నామమాత్రంగా పన్ను చెల్లిస్తున్న రేస్‌క్లబ్‌ను తన నియంత్రణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. రేస్‌క్లబ్ నిర్వాహకులు చేస్తున్న బెట్టింగ్ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ‘హైదరాబాద్ రేస్‌కోర్స్ అండ్ బెట్టింగ్ యాక్ట్- 1939’లోని లొసుగులను సరిదిద్ది.. ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో గుర్రపు పందాలు సాగేందుకు మార్గాలను అన్వేషిస్తోంది.

ఈ మేరకు ప్రభుత్వం ఆర్థిక, హోం శాఖల కార్యదర్శులు, వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కార్యదర్శి, ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు కమిషనర్‌లతో కూడిన ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రేస్‌క్లబ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుతున్న బెట్టింగ్‌ల తీరుతెన్నెలు, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నైలోని రేస్‌కోర్సుల్లో ఉన్న పన్ను విధానాలను అధ్యయనం చేయనుంది.

అలాగే ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించి కంప్యూటరైజేషన్ అవకాశాలపై కూడా ఈ కమిటీ వారంలోగా నివేదిక ఇవ్వనుంది. అనంతరం రేస్‌క్లబ్‌పై ప్రభుత్వ నియంత్రణ పెరిగే చర్యలను అధికారికంగా చేపట్టనున్నట్లు ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.
 బు‘కీ’లే కీలకం: ఏటా 300 రోజుల పాటు హైదరాబాద్ రేస్‌క్లబ్ ఆధ్వర్యంలో గుర్రపు పందాలు సాగుతాయి. మలక్‌పేట రేస్‌క్లబ్‌లో జరిగే పందాలతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, మైసూర్, ఢిల్లీ, ఊటీ, కోల్‌కతా, పుణెల్లో జరిగే పందాలకు కూడా ఇంటర్‌వ్యూనర్ బెట్టింగ్ నిర్వహిస్తారు.

హైదరాబాద్ రేస్‌క్లబ్ ద్వారా అధికారికంగా టికెట్లతో కూడిన బెట్టింగ్ జరుగుతుంది. అదే సమయంలో రేస్‌క్లబ్‌కు సమాంతరంగా 23 మంది బుకీలతో బెట్టింగ్ అసాధారణ రీతిలో సాగుతుంది. లెసైన్సుడ్ బుకీలుగా ఉన్న వీరి ద్వారా నల్లధనం  చలామణి అవుతుంది. ఎలాంటి టికెట్లు లేకుండా   కాగితం మీద రాసే అంకెల ఆధారంగా ఈ బెట్టింగ్ సాగుతుంది. రూ. 5వేలు బెట్టింగ్ కాసే వారికి రూ.500 అని రాసిన కాగితం ఇచ్చి వ్యాపారం నిర్వహిస్తారు. రోజు రూ.3 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది.

బెట్టింగ్ ద్వారా నిర్వాహకులు 12%పన్ను కింద వాణిజ్యపన్నుల శాఖకు నెలకు రూ. 5 కోట్ల వరకు చెల్లిస్తోంటే, 23 మంది బుకీలు సంవత్సరానికి రూ 5. కోట్ల వరకు చెల్లిస్తుండటం గమనార్హం. రేస్‌క్లబ్ అధికారికంగా చేసే వ్యాపారం కంప్యూటర్ బిల్లింగ్‌లో ఉండగా, బుకీల నల్ల వ్యాపారం మొత్తం చిత్తు కాగితాలపై సాగుతుంది. రెండు నెలల క్రితం అధికారులు రేస్‌క్లబ్‌పై దాడులు నిర్వహించగా, ఆరుగురు బుకీలురూ. 50 లక్షలు బెట్టింగ్ ద్వారా సమకూర్చుకొని రూ. 7 లక్షలకు అధికారికంగా లెక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో బుకీలతో రేస్‌క్లబ్ పాలకమండలి కుమ్మక్కై బెట్టింగ్ దందా సాగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

Advertisement
Advertisement