రాజన్ చేతికి ఆర్‌బీఐ పగ్గాలు | Sakshi
Sakshi News home page

రాజన్ చేతికి ఆర్‌బీఐ పగ్గాలు

Published Wed, Aug 7 2013 2:13 AM

Raghuram Rajan

దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులాంటి అత్యున్నత నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)లో కొత్త సారథి కొలువుదీరనున్నారు. ప్రపంచ విఖ్యాత ఆర్థిక రంగ నిపుణుడు రఘురామ్ గోవింద్ రాజన్.. ఆర్‌బీఐ గవర్నర్‌గా పగ్గాలు చేపట్టనున్నారు. వచ్చే నెల 4న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత గవర్నర్  స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రాజన్ నియామకానికి పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం 2008లో ప్రపంచదేశాలను అల్లాడించిన ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన రాజన్... ఎంతోమంది నిపుణులు, విశ్లేషకులను నివ్వెరపరిచారు. ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన ఎలాంటి విధానాలను అమలుచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రూపాయి కనీవినీఎరుగని రీతిలో పాతాళానికి పడిపోవడం, విలవిల్లాడుతున్న స్టాక్ మార్కెట్లు... ఆర్థిక మందగమనం వంటివి దేశాన్ని కుదిపేస్తున్నాయి. దీనికితోడు అధిక వడ్డీరేట్లు, ధరల మంటల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలిగిస్తారో వేచిచూడాల్సిందే.
 
 న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురామ్ జి. రాజన్  ఆర్‌బీఐ 23వ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం ఆమోదముద్ర వేశారు. 50 సంవత్సరాల రాజన్, మూడేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4వ తేదీన పదవీ విరమణ చేయనున్న దువ్వూరి సుబ్బారావు స్థానంలో రాజన్ బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
 
 రేట్ల వైఖరిపై సర్వత్రా ఆసక్తి!
 ద్రవ్యోల్బణంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధి రేటుకూ సైతం ఆర్‌బీఐ ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకు అనుగుణంగా పాలసీరేట్లను సైతం తగ్గించాలని కేంద్రం చేస్తున్న సూచనలకు ఇప్పటివరకూ రాజన్ సానుకూల రీతిలో స్పందిస్తూ వచ్చారు. డాలర్ మారకంలో రూపాయి విలువ కిందకు జారిపోవడాన్ని నిలువరించడానికి, ఒడిదుడుకులను నివారించడానికి ఆర్‌బీఐ ఇటీవల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరమైన కఠిన విధానాన్ని సమర్థిస్తూనే... ఆర్‌బీఐ రూపాయితోపాటు ఆర్థికాభివృద్ధి రేటుపైనా దృష్టి పెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక మందగమనం, తీవ్ర ఆహార ఉత్పత్తుల ధరలు, రూపాయి క్షీణత, తీవ్ర కరెంట్ అకౌంట్ లోటు వంటి సవాళ్లతో కూడిన ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల  నేపథ్యంలో- ద్రవ్యోల్బణం నియంత్రణే ప్రధాన ధ్యేయంగా దువ్వూరి సుబ్బారావు ఇప్పటివరకూ అనుసరిస్తూ వచ్చిన కఠిన విధానాన్ని రాజన్ కూడా కొనసాగిస్తారా...? లేక తనదైన శైలిలో ముందుకు వెళతారా అన్నది ప్రస్తుతం విశ్లేషకుల్లో ఆసక్తికరమైన చర్చ.
 
 మంత్రదండం లేదు...
 ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే రాజన్ స్పందిస్తూ... ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇబ్బందులను మాయం చేయడానికి తమ వద్ద మంత్రదండం ఏదీ లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే సవాళ్లను ఎదుర్కొనగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. సర్వోన్నత సమగ్రత, స్వతంత్రత, వృత్తి నిపుణత కలిగిన సంస్థగా ఆర్‌బీఐని ఆయన అభివర్ణించారు.
 
 పాలక, పారిశ్రామిక వర్గాల హర్షం
 రాజన్ నియామకం పట్ల పాలక, పారిశ్రామిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమయ్యింది. రాజన్ చక్కటి నిర్ణయాలు తీసుకుని బాగా పనిచేయగలరన్న అభిప్రాయాన్ని ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ సి.రంగరాజన్ వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంలో అత్యంత ప్రతిభావంతుడైన రాజన్ నుంచి  ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధికి తగిన సంకేతాలు, మార్గదర్శకాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా వ్యక్తం చేశారు. గవర్నర్‌గా మంచి నిర్ణయాలు తీసుకోడానికి ఆర్థిక రంగంలో ఆయన అపార అనుభవం దోహదపడుతుందని సీఐఐ మాజీ ప్రెసిడెంట్ ఆది గోద్రెజ్ పేర్కొన్నారు. రాజన్ లాంటి ప్రముఖ ఆర్థికవేత్త ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం మనకు అదృష్టమని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ అన్నారు. రాజన్ ఎంపిక ‘చాలా చక్కనిది’ అని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కట్టడిలో, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనడంలో ఆయన విజయం సాధించగలరని అసోచామ్ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది.
 
 చిన్న వయసులోనే..
 ఆర్‌బీఐ గవర్నర్‌గా అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తుల్లో రాజన్ ఒకరు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 5న బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన వయసు 50 సంవత్సరాల 6 నెలలుగా ఉంటుంది. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ 1982లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన తన 50వ పుట్టిన రోజుకు 10 రోజుల దూరంలో ఉన్నారు. 1932 సెప్టెంబర్ 26న జన్మించిన మన్మోహన్, 1982 సెప్టెంబర్ 16న ఆర్‌బీఐ పగ్గాలు చేపట్టారు.  ఆర్‌బీఐకి అతి చిన్న వయసులో గవర్నర్ బాధ్యతలు చేపట్టిన రికార్డు ఇప్పటికీ సర్ సీడీ దేశ్‌ముఖ్‌కే దక్కుతుంది. 1943లో కేవలం 47 ఏళ్ల వయస్సులోనే ఆయన ఈ బాధ్యతల్లో నియమితులయ్యారు. 1947లో భారత్ స్వాతంత్య్రం పొందే వరకూ ఆయన కొనసాగారు. ఈ పదవిలో నియమితుడైన మొట్టమొదటి భారతీయుడు కూడా ఆయనే. గత పదేళ్ల కాలంలో నాన్-సివిల్ సర్వెంట్‌గా ఆర్‌బీఐ గవర్నర్ కుర్చీలోకి రాబోతున్న వ్యక్తి రాజన్. ఇంతక్రితం బిమల్ జలాన్ నాన్-ఐఏఎస్‌గా ఈ బాధ్యతలను నిర్వహించి 2003లో పదవీ విరమణ చేశారు.
 
 రచనలు...

  •       సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ ది క్యాపిటలిస్ట్స్
  •      ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ ముప్పుగా పొంచి ఉన్న పెను సవాళ్ల  గురించి ఆయన రచించిన  ‘ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకం అత్యధిక ప్రాచుర్యం  పొందింది.
  •      భారత్‌లో ప్రణాళికా సంఘానికి సంబంధించి ఆర్థిక రంగ సంస్కరణలపై  నివేదికను రూపొందించడంలో కూడా ఆయన కీలక బాధ్యతలు పోషించారు.

 
 అత్యున్నతస్థాయి బాధ్యతలు...

  •   గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ ఎకనమి    స్ట్‌గా పనిచేసిన రాజన్, గత ఏడాది ఆగస్టులో  కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ)గా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,  చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేస్తున్న కౌశిక్ బసు స్థానంలో ఆయన ఆగస్టులో ఈ బాధ్యతలు చేపట్టారు.
  •      సీఈఏగా బాధ్యతలను చేపట్టే నాటికి ఆయన షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
  •  గతంలో ప్రధాన మంత్రికి గౌరవ ఆర్థిక సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు.

 
 ముందుచూపు...

  •  ఆర్థిక అంశాల విశ్లేషణలో తనకంటూ ఒక ప్రత్యేకత. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన అతి కొద్ది మంది ఆర్థికవేత్తల్లో ఒకరిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.

Advertisement
Advertisement