Sakshi News home page

సీఆర్‌పీఎఫ్‌కు ఎట్టకేలకు అధిపతి దొరికారు!

Published Wed, Apr 26 2017 7:26 PM

సీఆర్‌పీఎఫ్‌కు ఎట్టకేలకు అధిపతి దొరికారు! - Sakshi

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీఆర్‌పీఎఫ్‌కు అధిపతిని నియమించింది. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా రాజీవ్‌ రాయ్‌ భట్నాగర్‌ను కేంద్ర హోంశాఖ బుధవారం నియమించింది. రాయ్‌ 1983 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి.  రెండురోజుల కిందట సుక్మాలో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో 25మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో కేంద్రం తీరును కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై విమర్శించారు. సీఆర్‌పీఎఫ్‌కు ఇప్పటివరకు పూర్తికాలం అధిపతిని నియమించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.   

సీఆర్‌పీఎఫ్‌ గత డైరెక్టర్‌ జనరల్‌ దుర్గా ప్రసాద్‌ ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేశారు. అంతకు నెల రోజుల ముందే వారసుడిని నియమించాలి. కానీ కేంద్ర హోం శాఖ నిన్నటివరకు నిర్ణయం తీసుకోలేదు. పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టుల వెన్నుముక విరిగిపోయిందని, మరో దిక్కులేక దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించింది. ఇది తప్పుడు ప్రకటనని తర్వాత తేలింది. సుక్మా దాడి నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్‌కు వెంటనే అధిపతిని నియమించినట్టు తెలుస్తోంది. అలాగే ఇండో-టిబేటన్‌ బార్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)కి 1983 బ్యాచ్‌కు చెందిన ఆర్కే ప్రచండ నియమితులయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement