రేప్ కేసు: మంత్రి అదృశ్యం! | Sakshi
Sakshi News home page

రేప్ కేసు: మంత్రి అదృశ్యం!

Published Wed, Mar 1 2017 3:36 PM

రేప్ కేసు: మంత్రి అదృశ్యం! - Sakshi

సుప్రీంకోర్టు సూచనల మేరకు ఉత్తర ప్రదేశ్ మంత్రి గాయత్రీ ప్రజాపతి మీద పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేయడంతో.. ఆయన ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయారు. ఆయనను ప్రశ్నించేందుకు వెళ్లిన పోలీసులకు మంత్రి ఆచూకీ ఎక్కడా దొరకలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అమేథి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గాయత్రీ ప్రజాపతి కోసం అక్కడ గాలించినా కనిపించలేదు. లక్నోలోని తన అధికారిక బంగ్లాలో కూడా ఆయన లేరు. 
 
ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు తాము ఒక పోలీసు బృందాన్ని అమేథీకి పంపగా.. ఆయన లక్నో వెళ్లిపోయినట్లు చెప్పారని, కానీ లక్నోకు కూడా రాలేదని లక్నో సీనియర్ ఎస్పీ మంజిల్ సైనీ చెప్పారు. ప్రస్తుతానికి తాము కేవలం ఆయన వాంగ్మూలమే నమోదు చేయాలనుకుంటున్నామని, కానీ ఆయన ఇలాగే తప్పించుకుని తిరిగితే తాము ఇతర చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. మంత్రిని అరెస్టు చేయడానికి తగిన వారంటు కోసం కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా లేకపోలేదన్నారు. ప్రజాపతి ఎక్కడున్నారో గమనించేందుకు ఆయన సెల్‌ఫోన్‌ కాల్ డీటైల్ రికార్డు (సీడీఆర్) కూడా సేకరించినట్లు తెలుస్తోంది. మంత్రి గాయత్రీ ప్రజాపతి, ఆయన అనుచరులు కలిసి తనపై అత్యాచారం చేశారని ఓ బాలిక ఫిర్యాదు చేయడం, ఆమె కోర్టు ముందు తన వాంగ్మూలం కూడా చెప్పడంతో.. ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఆ బాలికకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement