Sakshi News home page

రేప్ బాధితురాలికి సుప్రీంకోర్టులో ఊరట

Published Thu, Jul 30 2015 5:30 PM

రేప్ బాధితురాలికి సుప్రీంకోర్టులో ఊరట - Sakshi

గుజరాత్లో అత్యాచార బాధితురాలికి కొద్దిపాటి ఊరట లభించింది. గుజరాత్ రాష్ట్రంలో ఓ బాలిక అత్యాచారానికి గురై గర్భవతి కూడా అయ్యింది. దాంతో తన కూతురికి అబార్షన్ చేయించేందుకు అనుమతించాలంటూ ఆమె తండ్రి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు అందుకు నిరాకరించింది. గర్భం దాల్చి 20 వారాలు దాటిన తర్వాత భారతీయ చట్టం ఇలాంటి పనులకు అంగీకరించదని స్పష్టం చేసింది. దానిపై బాలిక తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఆయన వాదనను అంగీకరించింది. అబార్షన్ చేయకుండా గర్భం కొనసాగితే, ప్రసవం వల్ల ఆ బాలిక ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉందా అనే విషయాన్ని తేల్చేందుకు నలుగురు సభ్యులతో కూడిన వైద్యబృందాన్ని నియమించింది. బాలికకు వైద్య పరీక్షలు చేసిన ఆ బృందం.. ఆమెకు అబార్షన్ చేయడమే మంచిదని తేల్చిచెప్పింది. దాంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆమెకు అబార్షన్ చేయనున్నారు.

టైపాయిడ్ జ్వరంతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలిక వైద్యం నిమిత్తం ఓ వైద్యుడిని సంప్రదించగా అతడు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అబార్షన్కు అనుమతించాలంటూ ఆమె తండ్రి గతవారం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన ధర్మాసనం.. గర్భం దాల్చిన తర్వాత 20 వారాలు దాటితే భారతీయ చట్టం అబార్షన్కు అనుమతించదని.. ప్రస్తుతం ఆ అమ్మాయికి 24 వారాలు పూర్తయినందున రేప్ బాధితురాలు అయినా అబార్షన్కు చట్టం ఒప్పుకోదని స్పష్టం చేసింది. ప్రసవం పూర్తయ్యేవరకు ఆమె మంచిచెడులు చూసుకోవాలని, పరిహారంగా ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే, దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీం ధర్మాసనం నియమించిన వైద్యబృందం అబార్షన్కు అనుమతించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement