కాంగ్రెస్ ఎంపీ రషీద్ మసూద్కు నాలుగేళ్లు జైలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఎంపీ రషీద్ మసూద్కు నాలుగేళ్లు జైలు

Published Tue, Oct 1 2013 2:48 PM

కాంగ్రెస్ ఎంపీ రషీద్ మసూద్కు నాలుగేళ్లు జైలు - Sakshi

న్యూఢిల్లీ : అవినీతి అక్రమాల కేసులో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రషీద్ మసూద్కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు తీస్‌హజారీ కోర్టు మంగళవారం శిక్ష ఖరారు చేసింది. నాలుగేళ్ల జైలుతో రషీద్ మసూద్ ఎంపీ పదవి కోల్పోనున్నారు. అలాగే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. ప్రస్తుతం సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్నారు.

దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో త్రిపుర రాష్ట్రానికి కేటాయించిన ఎంబిబిఎస్ సీట్లను అనర్హులైన అభ్యర్థులకు కట్టబెట్టిన వ్యవహారంలో రషీద్ మసూద్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. తీర్పు వచ్చాక.. తొలిసారి కేంద్ర మాజీ మంత్రి రషీద్  దోషిగా తేలారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన ఆయనను అవినీతి, ఇతర నేరాల కేసుల్లో ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది.

దీంతో ఆయనపై తొలిసారిగా అనర్హత వేటు పడింది. దోషులుగా తేలిన ఎమ్మెల్యేలు, ఎంపీల అప్పీళ్లు పై కోర్టుల్లో ఉన్నంతవరకు పదవుల్లో కొనసాగేందుకు వీలు కల్పించిన ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8, సబ్ సెక్షన్ 4ను కొట్టేస్తూ సుప్రీం కోర్టు ఈ ఏడాది జూలై 10న తీర్పివ్వడం తెలిసిందే. 1990-91 మధ్య వీపీ సింగ్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన మసూద్.. త్రిపురకు కేంద్రం కోటా కింద బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కేటాయించిన ఎంబీబీఎస్ సీట్లను అక్రమంగా అనర్హులకు కట్టబెట్టారని సీబీఐ  అభియోగాలు మోపింది.
 
మసూద్ 1989-91 మధ్య అప్పటి త్రిపుర రెసిడెంట్ కమిషనర్ గురుదయాళ్ సింగ్‌తో కుట్రపన్ని తన సమీప బంధువైన విద్యార్థితోపాటు ఇద్దరికి మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పించారని ఆరోపించింది. సీట్ల కేటాయింపుపై మొత్తం 11 కేసులు నమోదు చేసింది. వీటిలో మూడు కేసుల్లో మసూద్‌ను సీబీఐ కోర్టు జడ్జి జేపీఎస్ మాలిక్ అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని 120బీ(నేరపూరిత కుట్ర), 420(మోసం), 468(ఫోర్జరీ) కింద దోషిగా తేల్చారు.
 
మరో ఫోర్జరీ కేసులో నిర్దోషిగా ప్రకటించారు. కాగా, మిగతా కేసుల్లో గురుదయాళ్‌ను, అప్పటి త్రిపుర సీఎం సుధీర్ రంజన్ మజుందార్ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అమల్‌కుమార్ రాయ్‌లను, అక్రమంగా సీట్లు పొందిన 9 మంది విద్యార్థులను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ విద్యార్థుల్లో మసూద్ బంధువు కూడా ఉన్నాడు. కోర్టు మసూద్‌కు వచ్చే నెల 1న శిక్ష ఖరారు చేయనుంది. ఆయనకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. మసూద్ 90 రోజుల్లోగా తీర్పుపై అప్పీలు చేసుకోవచ్చు. కాగా, ఈ కేసుల్లో నిందితులైన సుధీర్ మజుందార్, నాటి త్రిపుర మంత్రి కాశీరామ్ రీంగ్ కేసు విచారణ కాలంలో చనిపోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement