Sakshi News home page

గైక్వాడ్‌ చేసింది కరెక్టే: ఎమ్మెల్యే

Published Fri, Mar 24 2017 8:20 PM

గైక్వాడ్‌ చేసింది కరెక్టే: ఎమ్మెల్యే

ముంబై: ఎయిరిండియా అధికారి సుకుమార్‌పై చెప్పుతో దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై తీవ్ర విమర్శలు వస్తుండగా.. మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే బచ్చు కడు ఆయన చర్యను సమర్థించారు. అధికారిని  ఎంపీ కొట్టడం సరైన చర్యని వ్యాఖ్యానించారు. పైగా తాను కూడా గతంలో ఓ అధికారిని 20 సార్లు చెంపదెబ్బ కొట్టానని చెప్పారు.

ఓ అధికారిని గైక్వాడ్ కొట్టారంటే.. దానికి తగిన కారణం ఉండి ఉంటుందని కడు అన్నారు. ప్రజా ప్రతినిధులతో కొందరు అధికారులు దురుసుగా ప్రవర్తిస్తారని, తమ గురించి వాళ్లు ఏమనుకుంటున్నారని, చేతులు కట్టుకుని నిలబడాలా అని కడు వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా అచల్‌పూర్ నుంచి ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. శివసేన కూడా రవీంద్రను వెనకేసుకొచ్చింది. ఎయిరిండియా ఆత్మపరిశీలన చేసుకోవాలని పేర్కొంది.

ఈ దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు.. గైక్వాడ్‌పై కేసు నమోదు చేశారు. ఎయిరిండియాతో పాటు విస్తారా, ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్ లాంటి సంస్థలు ఆయన్ను బహిష్కరించాయి. కాగా కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాలి కానీ ప్రయాణించకుండా, టికెట్ ఇవ్వకుండా అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement