చౌక వడ్డీరేట్లే పరిష్కారం కాదు | Sakshi
Sakshi News home page

చౌక వడ్డీరేట్లే పరిష్కారం కాదు

Published Sat, Sep 28 2013 12:40 AM

చౌక వడ్డీరేట్లే పరిష్కారం కాదు

ఫ్రాంక్‌ఫర్ట్: ఆర్థిక రంగంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌ను మరో విశిష్ట పురస్కారం వరించింది. ఆర్థిక, ఫైనాన్షియల్ రంగంలో చేసిన విశేష పరిశోధనకు గుర్తింపుగా డాయిష్ బ్యాంక్ అవార్డు లభించింది. ‘ఫైనాన్షియల్ ఎకనామిక్స్-2013’ పేరుతో అయిదో డాయిష్ బ్యాంక్ ప్రైజ్‌ను ఆయన అందుకున్నారు. ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక విధానాలను అత్యంత ప్రభావితం చేశాయి.
 
 ఈ ఏడాది ఈ ప్రైజ్‌కు రాజన్ కంటే సమర్ధుడైన వ్యక్తిని ఎంపిక చేయడం అనేది చాలా కష్టతరమైన అంశమేనని అవార్డును అందజేసిన సందర్భంగా డాయిష్ బ్యాంక్ కో-చైర్మన్ జుర్గెన్ ఫిషెన్ వ్యాఖ్యానించారు. ఈ అకడమిక్ అవార్డును స్పాన్సర్ చేస్తున్న డాయిష్ బ్యాంక్ డొనేషన్ ఫండ్ 50 వేల యూరోలను ఆయనకు అందిస్తోంది. గోతే యూనివర్సిటీ ఫ్రాంక్‌ఫర్ట్, సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్(సీఎఫ్‌ఎస్)ల భాగస్వామ్యంతో రెండేళ్లకోసారి ఈ ప్రైజ్‌ను ప్రదానం చేస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 37 దేశాల నుంచి అత్యున్నత యూనివర్సిటీలు, కేంద్ర బ్యాంకులు, పరిశోధన సంస్థల నుంచి 260కిపైగా నామినేషన్స్ రాగా ఇందులోనుంచి రాజన్ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం. సగానికిపైగా నామినేషన్స్ అమెరికా నుంచి రావడం గమనార్హం.
 
 అత్యంత చౌక వడ్డీరేట్లతో చిక్కే...
 అవార్డును స్వీకరించిన సందర్భంగా రాజన్ మాట్లాడుతూ.. ఆర్థికపరమైన సమస్యల నుంచి గట్టెక్కడానికి అత్యంత చౌక వడ్డీరేట్లు అనేవి పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘చౌక వడ్డీరేట్లు అనేవి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిధులను వెచ్చించేందుకు పురిగొల్పగలదు. అయితే, దీనివల్ల కొత్తగా వ్యాపారాలు వృద్ధి చెందుతాయా అనేది అనుమానాస్పదమే. ఆర్థిక ఇబ్బందులకు చౌక వడ్డీరేట్లు పరిష్కారమా లేదంటే ఇవి కూడా సమస్యలో ఒక భాగమా అనేది ప్రశ్నించుకోవాల్సిన తరుణమిది’ అని రాజన్ అభిప్రాయపడ్డారు.  అనిశ్చితి కారణంగా పెట్టుబడులు నిలిచిపోయిన పరిస్థితుల్లో వీటిమధ్య ఎలాంటి అవినాభావ సంబంధానికి తావుండదని, ఉన్నా చాలా పరిమితమేనని కూడా ఆయన పేర్కొన్నారు. ‘వాస్తవానికి చౌక వడ్డీరేట్లు అనేవి ఆర్థిక వ్యవస్థకు చిక్కులను సృష్టిస్తాయి. కొత్త సంక్షోభాలకు ఇవి నాందిగా కూడా పరిణమించొచ్చు’ అని రాజన్ పేర్కొన్నారు. భారత్‌లో ఆర్థిక మందగమనానికి అధిక వడ్డీరేట్లే కారణమని కార్పొరేట్ రంగం గగ్గోలు పెడుతున్నప్పటికీ... ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా తొలి పాలసీ సమీక్షలోనే వడ్డీరేట్ల(రెపో)ను పావు శాతం పెంచిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
 ఆర్‌బీఐ పాలసీపై...
 కాగా, ఆర్‌బీఐ పాలసీపై అడిగిన ప్రశ్నకు... ప్రస్తుతం ఎలాంటి అభిప్రాయం లేదని, భవిష్యత్తులో పరిణామాలను గమనించాల్సి ఉంటుందన్నారు. ‘దురదృష్టవశాత్తు... ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే ఉంది. ముఖ్యంగా ఆహారోత్పత్తులు, ఇంధన ధరల పెరుగుదలే కాకుండా ఇతర అంశాలు కూడా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి’ అని రాజన్ వివరించారు.
 
 సంక్షోభాన్ని ముందే పసిగట్టారు...
 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వెలుగులోకి రావడానికి మూడేళ్ల ముందే అంటే 2005లోనే ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థలో తట్టుకోలేనంత స్థాయిలో అసమానతలు చోటుచేసుకుంటున్నాయని... ఇది ముప్పుగా పరిణమించనుందని రాజన్ హెచ్చరించిన విషయాన్ని ఫిషెన్ గుర్తుచేశారు. తద్వారా సంక్షోభాన్ని ముందుగానే పసిగట్టిన వ్యక్తుల్లో ఒకరుగానిలిచారని చెప్పారు. ముఖ్యంగా ఆర్థికపరమైన నియంత్రణలను వాస్తవ లక్ష్యాల కోసం కాకుండా నిరుపయోగం చేయడం వల్ల వచ్చే విపరిణామాలపై కూడా రాజన్ ముందే హెచ్చరించారని డాయిష్ బ్యాంక్ కో-చైర్మన్ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement